సాక్షి, కర్నూలు: కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదానికి ముందు బైకర్ శివశంకర్ వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ వీడియో ద్వారా శివశంకర్ మద్యం సేవించి ఉంటాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు.. బస్సు ప్రమాద ఘటనలో పల్నాడు జిల్లాలకు చెందిన డ్రైవర్ లక్ష్మయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు.
కర్నూలు బస్సు ప్రమాదానికి ముందు బైకర్ శివశంకర్ వీడియో ఒకటి బయటకు వచ్చింది. ప్రమాదానికి ముందు బైక్‌కు పెట్రోల్ కొట్టించినట్టు వీడియోలో కనిపిస్తోంది. అర్ధరాత్రి 2.20 గంటల సమయంలో శివశంకర్‌తో పాటుగా అతడి స్నేహితుడు కలిసి పెట్రోల్ బంక్‌లోకి వెళ్లారు. ఆ తర్వాత ఒక్కడే బైక్‌పై వెళ్లినట్టు వీడియోలో ఉంది. శివశంకర్ బంక్‌లో ఉన్న సమయంలో స్టంట్ చేయడం, తడబడుతున్నట్టుగా కూడా కనిపించింది. బైక్ స్టార్ట్ చేసి కొద్ది దూరం వెళ్లిన వెంటనే స్కిడ్ అయినట్టుగా వీడియోలో స్పష్టంగా ఉంది. దీంతో, అతడు మద్యం సేవించి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండగా.. శివశంకర్ వచ్చిన బైక్ చాలా దారుణంగా ఉంది.. బైక్‌కు హెడ్‌లైట్ లేకపోవడం గమనార్హం. పైగా అతడు ర్యాష్ డ్రైవింగ్ చేసే విధంగా కనిపించడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరోవైపు.. ఈ ప్రమాదానికి సంబంధించి బస్సు డ్రైవర్ మిరియాల లక్ష్మయ్యపై ఉలిందకోండా పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ కేసును ప్రయాణికుడు రమేష్ ఫిర్యాదు చేయగా... బస్సు నడిపిస్తున్న ముత్యాల లక్ష్మయ్య, అతని సహచరుడు జి. శివనారాయణని పోలీసులు అరెస్ట్ చేశారు. లక్ష్మయ్యపై సెక్షన్ 125/A, 106 C, సంబంధిత నిబంధనల ఆధారంగా కేసులు నమోదు చేసి, 19 మంది ప్రయాణికుల మరణానికి బాద్యుడుగా పేర్కొన్నారు. అలాగే, బస్సు మేనేజ్‌మెంట్ కూడా ఈ ఘటనకు బాధ్యులుగా ఉంచారు.
ఇది కూడా చదవండి: కర్నూలు బస్సు ప్రమాదంలో కొత్త కోణం.. వందల ఫోన్లు పేలడం వల్లే మంటలు..
ఇదిలా ఉండగా.. కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రమాద సమయంలో బస్సులో నిద్రిస్తున్నప్పటికీ, అప్రమత్తమై పలువురి ప్రాణాలను కాపాడి హీరోగా ప్రశంసలు అందుకున్న రెండో డ్రైవర్ శివనారాయణ (30) ఇప్పుడు పోలీసుల అనుమానపు నీడలో చిక్కుకున్నాడు. విచారణలో అతడు తన వాంగ్మూలాన్ని మార్చడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అయితే, ప్రమాద సమయంలో బస్సు నడుపుతున్న డ్రైవర్ లక్ష్మయ్య.. నిద్రిస్తున్న రెండో డ్రైవర్ శివనారాయణను నిద్ర లేపాడు. వెంటనే స్పందించిన శివనారాయణ పొగతో నిండిపోయి, డోర్లు తెరుచుకోని స్థితిలో ఉన్న బస్సు కిటికీలను ఒక రాడ్‌తో పగలగొట్టి చాలా మంది ప్రయాణికులను బయటకు లాగాడు. "నన్ను మొదట బయటకు లాగింది ఒక యువకుడే. అతడే రెండో డ్రైవర్ అని నాకు తర్వాత తెలిసింది" అంటూ ప్రాణాలతో బయటపడిన సుబ్రమణ్యం అనే ప్రయాణికుడు చెప్పాడు.
అనుమానాలకు కారణమేంటి?
ప్రమాదం జరిగిన వెంటనే అసలు డ్రైవర్ లక్ష్మయ్య ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. పోలీసులు శివనారాయణను అదుపులోకి తీసుకుని విచారించగా అతను తన వాంగ్మూలాన్ని మార్చినట్లు అధికారులు చెబుతున్నారు. మొదట బస్సు ఒక వాహనాన్ని ఢీకొట్టిందని, అది తీవ్రమైన ప్రమాదం కావచ్చని లక్ష్మయ్య తనను నిద్రలేపాడని చెప్పాడు. తర్వాత బస్సు కింద మోటార్ సైకిల్ ఇరుక్కుపోయినట్లు గుర్తించామని తెలిపాడు. అయితే, ఆ తర్వాత మాట మార్చి 'అంతకుముందే జరిగిన వేరే ప్రమాదంలో మోటార్‌సైకిల్, దానిపై ఉన్న వ్యక్తి రోడ్డుపై పడి ఉన్నారని, అది గమనించని లక్ష్మయ్య వారిపై నుంచి బస్సును నడపడంతో మంటలు చెలరేగాయని' చెప్పినట్లు పోలీసులు తెలిపారు. బస్సు యజమానులు తమ సంస్థపై విచారణ జరగకుండా ఉండేందుకు డ్రైవర్లను తప్పుదారి పట్టించేలా ఇలా చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.



