కర్నూలు జీజీహెచ్ మార్చురీ వద్ద మేఘనాథ్, దీపక్‌కుమార్ కుటుంబ సభ్యుల నుంచి సమాచారం సేకరిస్తున్న పోలీసులు
దహనమవుతున్న బస్సులోంచి ఆర్తనాదాలు
బయటకు లాగేయండని పెద్ద పెట్టున కేకలు
బస్సు లోపల తెరుచుకోని ఎమర్జెన్సీ డోర్లు
నిస్సహాయంగా ఉండిపోయిన తప్పించుకున్న వారు
తొలుత డ్రైవర్ ఒక్కడే నీళ్ల బాటిళ్లతో మంటలు ఆర్పే యత్నం
ప్రమాద తీవ్రత పెరగడంతో తప్పించుకోండని అరుస్తూ బయటకు దూకేసిన వైనం
మొదటే డ్రైవర్ అందరినీ అప్రమత్తం చేసి ఉంటే బావుండేదని ప్రత్యక్ష సాక్షుల ఆవేదన
కర్నూలు (సెంట్రల్): కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు సమీపంలో జాతీయ రహదారి–44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారు చివరి వరకు ప్రాణాలను కాపాడుకోవడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించారని ప్రత్యక్ష సాక్షులు ఆవేదన వ్యక్తం చేశారు. బైక్‌ను బస్సు ఢీకొట్టి.. అలాగే 300 మీటర్ల మేర బైక్‌ను లాక్కు పోవడంతో తొలుత బస్సు ముందు భాగంలో మంటలు వ్యాపించాయి. దీంతో ముందు ఉన్న వారు బస్సు మధ్యకు వచ్చి ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేయడానికి విఫల యత్నం చేశారు. అంతలో మంటలు అలుము కోవడంతో ఎక్కువ మంది ఒకేచోట గుమికూడి కిందపడి పోయారు.
ఈ క్రమంలో ‘కాలిపోతున్నాం.. కాపాడండి.. బయటకు లాగేయండి.. దేవుడా కాపాడు..’ అంటూ ఆర్తనాదాలు చేశారు. వారి అరుపులు బయటకు వినిపిస్తున్నా తాము ఏమీ చేయలేని పరిస్థితి అని అప్పటికే బస్సులోంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్న వారు తెలిపారు. తొలుత మంటలను అదుపు చేయడానికి నీళ్ల బాటిళ్లతో డ్రైవర్ ప్రయత్నం చేశాడని, అలా కాకుండా ఆయన ఎమర్జెన్సీ డోర్‌లను బద్దలు కొట్టి ఉంటే మరింత మంది ప్రాణాలతో బయటపడే వారని చెప్పారు.
పెద్ద కుదుపు రావడంతో ఒక్కసారిగా లేచాం
మాది కర్ణాటకలోని బసవ కల్యాణం. పనిపై హైదరాబాద్ వెళ్లి తిరిగి వెళ్తున్నాను. అర్ధరాత్రి 2.30 – 2.40 గంటల మధ్య ప్రమాదం జరిగింది. అందరూ నిద్రలో ఉన్నారు. అయితే ఒక్కసారిగా పెద్ద కుదుపు రావడంతో చాలా మంది నిద్ర లేచారు. నేనూ అప్పుడే లేచాను. ఏమి జరిగిందోనని చూసుకునేలోపే మంటలు వచ్చాయి. ఎమర్జెన్సీ విండోలు తెరుచుకొని వెళ్లాలని డ్రైవర్ అరిచాడు. వెంటనే నేను ముందుకు వెళ్లి డ్రైవర్ సీటులో నుంచి కిందకు దూకేశాను. – ఆకాష్, బస్సులో నుంచి ప్రాణాలతో బయటపడిన వ్యక్తి
కాపాడండని అరుపులు వినిపించాయి
ఒక్కసారిగా బాంబు పడ్డట్లు పెద్ద శబ్దం వినిపించడంతో రోడ్డు వైపు చూశాను. కొద్ది దూరంలో బస్సు మంటల్లో తగలబడిపోతూ కనిపించింది. పరుగెత్తుకుంటూ దగ్గరకు వెళ్లాను. అయితే పెద్ద ఎత్తున మంటలు వస్తుండడంతో ఏమీ చేయలేకపోయాను. బస్సులో నుంచి కాపాడండి.. మంటల్లో కాలిపోతున్నామని కేకలు వినిపించాయి. ఆడోళ్ల గోడు చెవులారా విన్నాను. అయినా ఏమీ చేయలేని పరిస్థితి. నా జీవితంలో ఇలాంటి ఘటనను చూడలేదు. – మల్లికార్జున, నాయకల్లు (ఘటన స్థలికి సమీపంలోని కేఫ్‌లో సెక్యూరిటీ గార్డు)
ఫైర్ ముందు నుంచి వచ్చింది
బస్సులో ప్రయాణం చేస్తున్న సమయంలో 2.30 గంటలప్పుడు బస్సు ముందు నుంచి ఫైర్ వచ్చింది. దీంతో అందరూ వెనక్కి వెళ్లారు. ఎమర్జెన్సీ డోర్ తెరచుకోకపోవడంతో వెనక డోర్‌ను పగలగొట్టే ప్రయత్నం చేశారు. నేను మధ్యలో ఉన్న గ్లాస్‌ను పగలగొట్టి దూకేశాను. బెంగళూరుకు ఇంటర్వ్యూ కోసం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. – అశ్విన్, హైదరాబాద్, కూకట్‌పల్లి
కళ్ల ముందే కాలిపోయారు
బస్సు కళ్ల ముందే కాలిపోయింది. ఆ సమయంలో నేను మెలకువగా ఉండడంతో డ్రైవర్ సీటు నుంచి కిందకు దూకేశాను. నేను దూకిన తర్వాత ఒక్కసారిగా పెద్ద శబ్ధం వచి్చంది. ఆ తర్వాత మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. ఆర్పాలన్నా ఏమి చేయలేని పరిస్థితి. కాపాడాలని కేకలు వినిపించాయి. ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. ఈ పరిస్థితి శత్రువులకు కూడా రాకూడదు. – జయంత్ కుశ్వాల్, హైదరాబాద్


