
విధులు నిర్వహిస్తున్న ప్రాంతాల్లోనే నివాసం
కర్నూలు(అర్బన్): వసతి గృహ సంక్షేమాధికారులు తాము విధులు నిర్వహిస్తున్న ప్రాంతాల్లోనే నివాసం ఉండాలని, అందుకు అనుగుణంగా చిరునామాలను తమ కార్యాలయంలో అందించాలని జిల్లా బీసీ సంక్షేమ, సాధికారత అధికారిణి కె.ప్రసూన ఆదేశించారు. శుక్రవారం ఆమె తన చాంబర్‌లో సంక్షేమాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, నిర్ణీత సమయానికి ఆరోగ్య పరీక్షలు చేయించాలన్నారు. ప్రతి రోజు ఉదయం విద్యార్థులతో యోగా చేయించాలన్నారు. 10వ తరగతి పరీక్షల్లో గత సంవత్సరం కంటే ఈ ఏడాది మెరుగైన ఫలితాలు సాధించేలా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. బీసీ హాస్టళ్ల విద్యార్థులు కూడా ఐఐఐటీకి ఎంపికయ్యే విధంగా తర్ఫీదు ఇవ్వాలన్నారు. విద్యార్థులు, వసతి గృహ సంక్షేమాధికారులతో పాటు ఆయా వసతి గృహాల్లోని నాల్గవ తరగతి సిబ్బంది కూడా ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు నమోదు చేయాలన్నారు. ఆహార పదార్థాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, గడువు మీరిన వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించరాదన్నారు. సమావేశంలో సహాయ బీసీ సంక్షేమాధికారులు ఆంజనేయులు నాయక్, ఎం.శ్రీనివాసులు పాల్గొన్నారు.