
మండలానికి ఒక స్వచ్ఛ రథం
కర్నూలు(అర్బన్): గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల నుంచి పొడి వ్యర్థాలను స్వీకరించి వాటికి బదులుగా ని త్యావసర సరుకులను అందించేందుకు త్వరలో ప్రతి మండలానికి ఒక స్వచ్ఛ రథాన్ని ఏర్పాటు చేయనున్న ట్లు జిల్లా పరిషత్ సీఈఓ జి.నాసరరెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక జెడ్పీ ప్రాంగణంలోని డీపీఆర్‌సీ భవనంలో పంచాయతీ కార్యదర్శులు, డిప్యూటీ ఎంపీడీఓలకు ఎల్‌ఎస్‌డీజీఎస్ థీమ్–5(క్లీన్ అండ్ గ్రీన్) అనే అంశంపై ఒక రోజు టీఓటీ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ గతంలో పాత వస్తువులను విక్రయించి సిల్వర్, ప్లాస్టిక్ వస్తువులను పొందే సంస్కృతి నుంచి పొడి వ్యర్థాలను గ్రామ పంచాయతీలకు అందించి అవసరమైన నిత్యావసర సరుకులను పొందేందుకు వీలుగా స్వచ్ఛ రథాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలన్నారు. అందులో భాగంగా ఈ నెల 18న చేపట్టనున్న స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. శిక్షణా కార్యక్రమంలో డీపీఆర్‌సీ జిల్లా కోఆర్డినేటర్ మంజులావాణి, ట్రైనింగ్ మేనేజర్ గిడ్డేష్, టీఓటీలు ఆస్రఫ్‌బాషా, పి.జగన్నాథం పాల్గొన్నారు.