
వెంటాడుతున్న యూరియా కొరత
● రబీ సీజన్‌కు 26,226 టన్నులు అవసరం ● 17 రోజులు గడిచినా ఒక్క టన్ను కూడా రాని వైనం ● ఆర్‌బీకేలు, ప్రైవేటు డీలర్ల వద్ద నిల్
కర్నూలు(అగ్రికల్చర్): రబీ సీజన్‌ను కూడా యూరియా కొరత వెంటాడుతోంది. సీజన్ అక్టోబరు 1 నుంచి మొదలైనప్పటికీ ఇంతవరకు ఒక్క టన్ను కూడా యూరియా వచ్చిన దాఖలాలు లేవు. అవసరమైనంత యూరియా ఉందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నా.. క్షేత్రస్థాయిలో బస్తా కూడా లభించని పరిస్థితి నెలకొంది. మార్క్‌ఫెడ్, కంపెనీ గోదాముల్లో 3,800 టన్నుల యూరియా ఉందని అధికారులు చెబుతున్నా.. ప్రస్తుతం ప్రైవేటు డీలర్లు, రైతుభరోసా కేంద్రాల్లో బస్తా యూరియా కూడా లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 51 వేల టన్నుల యూరియా అవసరం ఉండగా... కేవలం 34 వేల టన్నులు మాత్రమే వచ్చింది. యూరియా సరఫరాలో కూటమి ప్రభుత్వం చేతులెత్తేయడంతో గతంలో ఎపుడూ లేని విధంగా రైతులు ఇబ్బందులు పడ్డారు. బస్తా యూరియా ధర రూ.267 ఉండగా.. రైతులు బస్తా రూ.600 వరకు ధరతో కొన్నారు. ఖరీఫ్ సీజన్‌లో అవసరమైన మేర యూరియా సరఫరాలో విఫలమైన ప్రభుత్వం రబీ సీజన్‌పై దృష్టి పెట్టకపోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ సీజన్‌కు సంబంధించి 26,226 టన్నుల యూరియా అవసరమవుతుందని జిల్లా వ్యవసాయ యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించింది. అయితే వ్యవసాయ శాఖ ఇంతవరకు సప్‌లై ప్లాన్ ఇవ్వలేదు. ఇంతవరకు ఒక్క టన్ను కూడా యూరియా సరఫరా చేయలేదు. రబీలో జిల్లాలో 1.10 లక్షల హెక్టార్లలో పంటలు సాగు అవుతాయి. వర్షాధారం కింద శనగ, వాము, నీటి ఆధారం కింద వేరుశనగ, వరి సాగు అవుతున్నాయి. కర్నూలు, ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, గూడూరులో యూరియా ఎక్కడా లభించడం లేదు. ఆర్‌బీకేలు, ప్రైవేటు డీలర్ల దగ్గర యూరియా అనేదే లేకపోవడంతో మళ్లీ రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడుతోంది.