
ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల గల్లంతు
● చెన్నారెడ్డి మృతదేహం లభ్యం
● గల్లంతైన మరో యువకుడు
ఉదయ్ కోసం గాలింపు
గోనెగండ్ల: గాజులదిన్నె ప్రాజెక్టు వద్ద పారుతున్న నీటిలో ఆడుతూ సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తూ కాలు జారి ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల గల్లంతు అయ్యారు. చెన్నారెడ్డి మృతదేహం లభ్యం కాగా ఉదయ్‌కుమార్ కోసం గాలిస్తున్నారు. ఎర్రకోట సెయింట్ జాన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం సీఈసీలో ఏఐ చదువుతున్న పీఎన్. చెన్నారెడ్డి(20), ఉదయ్ కుమార్(20), శివ, బాబు, అస్తాబ్, ధనుంజయ్, శ్రీనాథ్, సాయి గణేష్ విద్యార్థులు ఇంట్లో కళాశాలకు వెళ్తామని చెప్పి గురువారం ఉదయం గాజులదిన్నె ప్రాజెక్టుకు వచ్చారు. ప్రాజెక్టు గేట్లు, నీటి నిల్వ పరిసరాల్లో సందడి చేశారు. వారం రోజుల నుంచి గాజులదిన్నె ప్రాజెక్ట్ నాలుగవ క్రస్ట్ గేట్ ఎత్తి 300 క్యూసెక్కుల నీటిని హంద్రీ నదిలోకి విడుదల చేస్తున్నారు. మధ్యాహ్నం భోజనం అనంతరం పారుతున్న నీటిలో ఆడుతూ సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. సెల్ఫీలు దిగుతూ కాలు జారి చెన్నారెడ్డి, ఉదయ్ కుమార్ పారుతున్న నీటిలో కొట్టుకొని కిందకు పోయారు. దీన్ని గమనించిన శివ వారిని కాపాడే ప్రయత్నం చేసిన ఫలితం దక్కలేదు. చెన్నా రెడ్డి, ఉదయ్ కుమార్‌లు నీటిలో కొట్టుకుపోయి కింద ఉన్న నీటి గుంతలో మునిగిపోయారు. ఇద్దరు స్నేహితులు నీటిలో కొట్టుకుపోయి మునిగిపోవడంతో మిగతా వారు కేకలు వేశారు. దీంతో ప్రాజెక్టు అధికారులు గేటును మూసివేశారు. అయితే అప్పటికే వారిద్దరూ నీటిలో గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని మత్స్యకారులతో వెతికించారు. సాయంత్రం చెన్నారెడ్డి మృతదేహం లభ్యమైంది. ఉదయ్ కుమార్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చీకటి పడడంతో కనిపించదని మత్స్యకారులు బయటికి వచ్చారు. శుక్రవారం ఉదయం ఉదయ్ కోసం గాలిస్తామని అధికారులు తెలిపారు. చెన్నారెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఎమ్మిగనూరు ఆస్పత్రికి తరలించారు.
ఎందుకు బతకాలి?
‘ఉన్న ఒక్క కొడుకును పోగొట్టుకుని మేం ఎందుకు బతకాలిరా’ అంటూ చెన్నారెడ్డి తల్లిదండ్రులు మోహన్ రెడ్డి, శకుంతలు రోదించారు. ఎమ్మిగనూరుకు చెందిన మోహన్ రెడ్డి, శకుంతలకు ఒక కుమారుడు చెన్నారెడ్డి, ఇద్దరు కూమార్తెలు వైష్ణవి, చైతన్య ఉన్నారు. వీరు ఎమ్మిగనూరు పట్టణంలో హోటల్ పెట్టుకుని పిల్లల్ని చదివిస్తున్నారు. గత ఐదేళ్లుగా తండ్రి మౌలేశ్వర రెడ్డి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. తల్లి ఒక్కటే హోటల్ నడుపుతూ పెద్ద కూతురుకు వైష్ణవికు వివాహం చేశారు. హోటల్‌లో వచ్చిన సంపదనతోనే చెన్నారెడ్డిని, చైతన్యను చదివిస్తున్నారు. చెన్నారెడ్డి మృతిచెందిన సంఘటన తెలుసుకున్న తల్లిదండ్రులు ప్రాజెక్టుకు చేరుకొని ఒక ఏడాదిలో చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం చేస్తూ మమ్మల్ని పోషిస్తాడని ఎన్నో ఆశాలు పెట్టుకున్నాం. కానీ మమ్మల్ని ఇలా ఒంటరిని చేసి వెళ్లి పోతావని అనుకోలేదని ఉన్న ఒక్క కుమారుడు పోయాడు. ఇక మేము ఎందుకు బతకాలి అని తల్లిదండ్రులు రోదించారు.
మా స్నేహితులు నీటిలో కొట్టుకుపోయారని, కేకలు వేస్తూ సమీపంలో ఉన్న వారందరినీ వేడుకున్నా ఎవరు ముందుకు రాలేదు. నీటిలో మునిగిపోయారు సహాయం చేయండని వేడుకున్నా ఒక్కరూ కూడా సహాయం చేయలేదు. ఆ సమయంలో ఎవరైనా సహాయం చేసి ఉంటే మా స్నేహితులు బతికి ఉండేవారు. – చెన్నారెడ్డి, ఉదయ్ స్నేహితులు
చెన్నారెడ్డి, ఉదయ్ కుమార్ (ఫైల్)

ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల గల్లంతు

ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల గల్లంతు