
మెడికల్ కళాశాలలను బినామీలకు కట్టబెట్టే కుట్ర
కర్నూలు టౌన్: దేశంలో ఎక్కడా లేని విధంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో ఒకేసారి 17 ప్రభుత్వ వైద్య కళశాలలను తీసుకొస్తే.. కూటమి ప్రభుత్వం వాటిని బినామీలకు కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక బిర్లా సర్కిల్‌లోని శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాలులో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కర్నూలు నియోజక వర్గ విస్త్రృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి రూ.8,500 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఒక్కో కళాశాలకు 60 నుంచి 70 ఎకరాల స్థలం కేటాయించిందన్నారు. వైద్య విద్య, నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఉద్దేశించిన వైద్య కళాశాలలను నిర్వహణ చేయలేమని సీఎం చంద్రబాబు నాయుడు చేతులు ఎత్తేశాడన్నారు. అయితే పీపీపీ విధానం ముసుగులో విలువైన ఆసుపత్రులను బినామీలకు కట్టబెట్టే ప్రయత్నానికి తెర తీశారన్నారు. ఇప్పటికే ప్రజలకు రచ్చబండ ద్వారా ప్రభుత్వ వైద్య కళాశాలల ఆవశ్యకత వివరిస్తున్నామని, ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. కోటి సంతకాల సేకరణతో ప్రభుత్వం కళ్లు తెరిపిద్దామని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ మహిళా విభాగం మాజీ జిల్లా అధ్యక్షురాలు సిట్రా సత్యనారయణమ్మ, నగర అధ్యక్షుడు అహమ్మద్ అలీఖాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, బీసీ సెల్ అధ్యక్షుడు రాఘవేంద్ర, కార్పొరేటర్లు శ్రీనివాసరావు, క్రిష్ణకాంత్, రాజేశ్వర రెడ్డి, జుబేర్, ఫిరోజ్, రాంపుల్లయ్య యాదవ్, నరసింహులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
● వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షురాలు ఎస్వీ విజయ మనోహారి మాట్లాడుతూ పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించడమే వైఎస్సార్‌సీపీ లక్ష్యమన్నారు. పీపీపీని వ్యతిరేకించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. కోటి సంతకాలతో ప్రభుత్వ మెడలు వంచుదామన్నారు.
● వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రా హర్షవర్థన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడదామన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రయివేటీకరణను ప్రజాబలంతో నిలువరిద్దామన్నారు.

మెడికల్ కళాశాలలను బినామీలకు కట్టబెట్టే కుట్ర