
కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది
● సాక్షిపై అక్రమ కేసులకు నిరసనగా జర్నలిస్టుల నిరసన
కర్నూలు(సెంట్రల్): కూటమి ప్రభుత్వం సాక్షి ఎడిటర్, రిపోర్టర్లపై కక్షపూరితంగా కేసులు పెట్టడాన్ని జర్నలిస్టులు తీవ్రంగా నిరసించారు. ప్రభుత్వ తీరును తప్పుపడుతూ శుక్రవారం జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు అన్ని నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో నిరసన, ప్రదర్శనలు చేశారు. జాయింట్ కలెక్టర్, ఆర్‌డీఓలు, తహసీల్దార్లకు వినతిపత్రాలు ఇచ్చి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కర్నూలులో కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు పెద్ద ఎత్తున ధర్నాను నిర్వహించారు. ధర్నాకు ఏపీయూడబ్ల్యూజేఎఫ్, ఏపీయూడబ్ల్యూజే, రాయలసీమ జర్నలిస్టు వెల్ఫేర్ అసోసియేషన్ మద్దతు తెలిపి సంఘీభావం ప్రకటించాయి. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోరంట్లప్ప, కేబీ శ్రీనివాసులు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి శ్రీనివాస గౌడ్, రాయలసీమ జర్నలిస్టు వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కే.శ్రీనివాసులు మాట్లాడుతూ సాక్షి ఎడిటర్, రిపోర్టర్లపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే వెనక్కు తీసుకోవాలన్నారు. పోలీసులు ప్రభుత్వానికి వత్తాసుగా మీడియా స్వేచ్ఛను హరించడం తగదన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర ఎనలేనిదని, దానిని తొక్కిపెట్టడానికి పోలీసులు శతవిధాల ప్రయత్నిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. ప్రభుత్వ తప్పులను మీడియా ఎత్తి చూపితే కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నియంతలకు స్థానం ఉండదని, ఉన్నా తాత్కాలికమేనన్న విషయాన్ని కూటమి ప్రభుత్వం గ్రహించాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సాక్షిపై కక్షగట్టి రిపోర్టర్లపై కేసులు పెడుతున్నారన్నారు. కర్నూలు జిల్లాలోనూ ఆరుగురు రిపోర్టర్లపై కేసులను నమోదు చేశారని గుర్తు చేశారు. వెంటనే ఆయా కేసులను ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. అనంతరం గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఆ తర్వాత కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్‌ను కలిసి కూటమి ప్రభుత్వం మీడియా స్వేచ్ఛను హరిస్తున్న తీరును వివరించి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సాక్షి బ్యూరో, ఎడిషన్ ఇన్‌చార్జులు ఎం.రవికుమార్, శ్రీనివాసులు నాయుడు, సీనియర్ ఫొటోగ్రాఫర్ డి.హుస్సేన్, ప్రజాశక్తి ఎడిషన్ ఇన్‌చార్జి చంద్రయ్య, ఏపీయూడబ్ల్యూజే నాయకులు అవివాష్ శెట్టి, ఏపీడబ్ల్యూజేఎఫ్ నగర అధ్యక్ష, కార్యదర్శులు ఎం.శివశంకర్, ఎర్రమల, జర్నలిస్టులు సునీల్‌కుమార్, మణిబాబు, రవిప్రకాష్, చంద్రమోహన్, శ్రీనాథ్‌రెడ్డి, పుల్లంరాజు, హరి, పలువురు డెస్క్ జర్నలిస్టులు పాల్గొన్నారు.