
వేదావతి నదిపై బ్రిడ్జి నిర్మాణానికి కృషి
● కర్ణాటక బళ్లారి ఎంపీ తుకారామ్
హాలహర్వి: కర్ణాటక–ఆంధ్ర రాష్ట్రాల సరిహద్దులో ఉన్న వేదావతి నదిపై బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తామని కర్ణాటక రాష్ట్రం బళ్లారి ఎంపీ తుకారామ్ అన్నారు. గురువారం మండలంలోని గూళ్యం గ్రామంలో ఆయన పర్యటించారు. గ్రామ సమీపంలోని వేదావతి నదిపై బ్రిడ్జి నిర్మాణం, వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. వేదావతి నదిపై బ్రిడ్జి నిర్మాణానికి ఎంత నిధులు ఖర్చు అవుతాయన్న విషయాలపై ఆరా తీశారు. అనంతరం గాదిలింగేశ్వరస్వామి వారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. శ్రీ గాదిలింగేశ్వరస్వామి ఆశీర్వాదంతో గతంలో తాను రెండుసార్లు ఎమ్మెల్యేగా, ప్రస్తుతం ఎంపీగా ఎన్నికయ్యానన్నారు. గూళ్యం గ్రామ సమీపంలో ఉన్న వేదావతి నదిపై బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. వేదావతి నదిపై బ్రిడ్జి నిర్మాణం జరిగితే ఆంధ్ర–కర్ణాటక రాష్ట్రాల పరిధిలోని గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతాయన్నారు. ఈ విషయాన్ని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య దృష్టికి తీసుకెళ్తామన్నారు. 2026 ఉగాది రోజున వేదావతి నదిపై బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే బళ్లారి నుంచి ఆంధ్ర సరిహద్దు వరకు నేషనల్ హైవే రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో సండూరు ఎమ్మెల్యే అన్నపూర్ణ, కంప్లీ ఎమ్మెల్యే గణేష్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి శశికళ కృష్ణమోహన్, గూళ్యం మాజీ సర్పంచ్ రాజశేఖర్‌గౌడ్, కురువ సంఘం నాయకులు పూజారి మల్లన్న, బజారప్ప, వీరేశప్ప, లింగమల్లప్ప, మాజీ ఎంపీపీ గాదిలింగప్ప, తిప్పేష్ తదితరులు పాల్గొన్నారు.