కర్నూలులో భారీగా గంజాయి పట్టివేత | - | Sakshi
Sakshi News home page

కర్నూలులో భారీగా గంజాయి పట్టివేత

Sep 15 2025 8:23 AM | Updated on Sep 15 2025 8:23 AM

కర్నూ

కర్నూలులో భారీగా గంజాయి పట్టివేత

పంచలింగాల కేంద్రంగా

జోరుగా వ్యాపారం

20కిలోల గంజాయి, కారు సీజ్‌

దర్యాప్తు చేస్తున్న పోలీసులు

కర్నూలు: జిల్లా కేంద్రమైన కర్నూలులో భారీగా గంజాయి పట్టుబడింది. కర్నూలు మండలం పంచలింగాల గ్రామానికి చెందిన మీనిగ నరేంద్ర అలియాస్‌ నాని కొంత కాలంగా పంచలింగాల గ్రామాన్ని కేంద్రంగా చేసుకొని గంజాయి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. మూడు రోజుల క్రితం స్నేహితులతో కలసి కారు( ఏపీ 40 ఎన్‌ 3258)లో అరకు వెళ్లి అక్కడ గంజాయి కొనుగోలు చేసి కర్నూలు మీదుగా పంచలింగాలకు తరలిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో కర్నూలు 4వ పట్టణ సీఐ విక్రమసింహ ఆధ్వర్యంలో బళ్లారి చౌరస్తా ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిపైన ఆదివారం సాయంత్రం వాహన తనిఖీలు నిర్వహించారు. గంజాయి తరలిస్తున్న కారును స్వాధీనం చేసుకున్నారు. కారుకు ఉన్న నాలుగు డోర్ల వెనుకభాగంలో 49 ప్యాకెట్ల గంజాయిని పట్టుకున్నారు. డోర్‌ లాక్‌ హ్యాండిల్‌ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాక్స్‌ల్లో గంజాయి పొట్లాలను భద్రపరిచారు. క్యూఆర్‌టీ వాహనంతో పాటు ఓ లారీని హైదరాబాద్‌–బెంగళూరు జాతీయ రహదారిపై అడ్డంగా నిలిపి అనుమానాస్పద కారును తనిఖీ చేయగా గంజాయి బయటపడింది. డోర్‌లు లాక్‌లు తెరుచుకోకపోవడంతో మెకానిక్‌ను పిలిపించి వెనుక భాగంలో ఉన్న గంజాయి పొట్లాలను వెలికి తీశారు. కారులో ఉన్న వ్యాపారి నరేంద్రతో పాటు స్నేహితులు కర్నూలు ధర్మపేటకు చెందిన నల్లగోటి ఉమేష్‌చంద్ర, కొత్తపేట రైతుబ జారు దగ్గర ఉంటున్న పగిడాల గోవర్ధన్‌, ఎస్‌బీఐ కాలనీకి చెందిన షేక్‌ మహమ్మద్‌ అరీబ్‌, సాయిబాబ సంజీవయ్య నగర్‌కు చెందిన శిరిగిరి మృత్యుంజయ రెడ్డి తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. కల్లూరు తహసీల్దారు ఆంజనేయులు, ఆర్‌ఐ శ్రీనివాసరెడ్డి సమక్షంలో పంచానామా నిర్వహించి పోలీసులు కేసు నమోదు చేశారు.

పంచలింగాల కేందంగా

జోరుగా వ్యాపారం...

ఒడిశా సరిహద్దు నుంచి కర్నూలు మీదుగా స్వగ్రామం పంచలింగాలకు నెలలో మూడు సార్లు గంజాయి దిగుమతి చేసుకొని స్థానికంగా రహస్య కేంద్రాలకు తరలించి నరేంద్ర వ్యాపారం సాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. కర్నూలు చుట్టుముట్టు భారీగా విద్యాలయాలు ఉన్నాయి. విద్యార్ధులు, నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకొని గంజాయి సరఫరా చేసి సొమ్ము చేసుకుంటున్నట్లు ప్రాథమికంగా బయటపడింది. బాలాజీ నగర్‌, వెంకటరమణ కాలనీ, స్కంద కాలనీల్లో కొంతమంది యు వకులను ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకొని వారికి గంజాయి సరఫరా చేసి వ్యాపారం సాగిస్తున్నట్లు సమాచారం. ఈ ముఠా ఎంత కాలంగా ఈ వ్యాపారం సాగిస్తుంది... వారికి ఎవరెవరు సహకరిస్తున్నారు.. స్వాధీనం చేసుకన్న కారు ఎవరిది..తదితర విషయాలపై లోతైన దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. గంజాయి, మదక ద్రవ్యాల నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో ఈగల్‌ టీమ్‌ ఏర్పాటు చేసినప్పటికీ కర్నూలులో గంజాయి వ్యాపారాన్ని కట్టడి చేయలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

కర్నూలులో భారీగా గంజాయి పట్టివేత1
1/1

కర్నూలులో భారీగా గంజాయి పట్టివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement