
తుది జాబితా తర్జనభర్జన!
కర్నూలు సిటీ: ఉపాధ్యాయ పోస్టుల ఎంపిక తుది జాబితా ప్రక్రియ తర్జనభర్జనగా మారింది. డీఎస్సీ పరీక్షలు రాసిన అభ్యర్థులు ముందస్తు ప్రాధాన్యత పోస్ట్ ఆప్షన్ తీసుకొచ్చారు. పరీక్షలు ముగిసి తుది కీ విడుదల తరువాత ఇచ్చిన మెరిట్ జాబితాల్లో చాలా మంది అభ్యర్థులు రెండు, మూడు, నాలుగుకి పైగా పోస్టులలో అత్యుత్తమ మార్కులు సాధించారు. ప్రాధాన్యత పోస్ట్ ఆప్షన్ వీరి ఆనందాన్ని ఆవిరి చేసింది. సర్టిఫికేట్లు వెరిఫికేషన్ తరువాత ప్రాధాన్యత పోస్ట్ ఆఫ్షన్ ఫైనల్ అని ప్రకటించడంతో అభ్యర్థులు కొందరు ఈ నెల 2న హైకోర్టులో కేసు వేశారు. ప్రాధాన్యత ఆప్షన్ ఇచ్చిన పోస్ట్ ఇస్తూ అభ్యర్థి కోరుకునే పోస్ట్‌కు ఎంపిక చేయకుండా నిరాకరించడం తప్పు అని కోర్టు తప్పు పట్టింది. కోర్టు తీర్పుతో విద్యాశాఖ తర్జనభర్జన పడుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2,645 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు 39,997 మంది అభ్యర్థులు 73,256 దరఖాస్తులు చేసుకున్నారు. ఈ సమయంలోనే ఎస్‌జీటీకే ప్రాధాన్యత ఆప్షన్ ఇచ్చారు. పరీక్షల తరువాత ఇచ్చిన మెరిట్ జాబితాల్లో చాలా మంది రెండుకు మించి పోస్టులు సాధించారు. గత నెల 28, 29, 30 తేదీల్లో జరిగిన సర్టిఫికెట్ల పరిశీలన తరువాత ప్రాధాన్యత పోస్ట్‌కు మాత్రమే అర్హూలని, మిగిలిన పోస్టులలో అత్యధిక మార్కులు సాధించినా కూడా అర్హూలని కాదని విద్యాశాఖ ప్రకటించింది. దీంతో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో ఈ నెల 5న మొదట విచారణ జరుగగా, ఆ రోజు ప్రభుత్వ న్యాయవాది సమయం కోరడంతో 9వ తేదీకి వాయిదా వేశారు. ఆ రోజు జరిగిన విచారణలో ఒకే క్యాడర్ పోస్టులకు వర్తింపచేయడం సరైంది కాదని కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ తీర్పుతోనే శనివారం తుది సెలక్షన్ జాబితాలను విడుదల చేయలేదు. విద్యాశాఖ త్వరలో బెంచీకి అప్పీల్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అప్పీల్ చేసిన వెంటనే జాబితాలను జిల్లాలకు పంపించి, ఆయా జిల్లా కలెక్టర్ల ఆమోదం తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
డీఎస్సీలో ప్రాధాన్యత పోస్టు ఎంపికపై
కోర్టుకు వెళ్లిన అభ్యర్థులు
కోరుకున్న పోస్ట్‌కే
ఎంపిక చేయాల్సిందేనని తీర్పు
తీర్పుపై అప్పీల్ చేసే యోచనలో
విద్యాశాఖ!