
ముగిసిన పెథాలజీ వైద్యుల రాష్ట్ర సదస్సు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజీలో మూడు రోజులుగా కొనసాగుతున్న పెథాలజి వైద్యుల రాష్ట్ర సదస్సు ఆదివారం ముగిసింది. ఈ సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ మెడికల్ కాలేజీల నుంచి 612 మంది వైద్యులు హాజరైనట్లు ఆర్గనైజింగ్ ఛైర్మన్ డాక్టర్ బాలీశ్వరి తెలిపారు. వీరిలో 50 మందికి పైగా ప్రొఫెసర్లు, 75 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 150 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 140 మంది పీజీ వైద్యులు ఉన్నారన్నారు. మూడు రోజుల సదస్సుతో సరికొత్త వైద్య విధానాలను సీనియర్ వైద్యులు వివరించారని పేర్కొన్నారు.
కుమారుడిని హత్య చేసిన తండ్రి అరెస్ట్
దేవనకొండ: కుమారుడిని నీటి డ్రమ్ములో ముంచి హత్య చేసిన తండ్రి నరేష్‌ను అరెస్టు చేసినట్లు సీఐ వంశీనాథ్ ఆదివారం విలేకరులకు తెలిపారు. నిందితుడిని పత్తికొండ మెజిస్ట్రేట్ వద్ద హాజరు పరిచినట్లు చెప్పారు. దేవనకొండకు చెందిన చాకలి నరేష్, శ్రావణికి ఎనిమిది నెలల కుమారుడు సాగర్ ఉన్నాడు. నిత్యం భార్యతో గొడవ పెట్టుకునే నరేష్.. దేవనకొండలో గత రెండు రోజుల క్రితం కుమారుడిని నీటి డ్రమ్ములో ముంచి హత్య చేసిన విషయం తెలిసిందే.
రేపు మార్కెట్‌లో ఉల్లి కొనుగోళ్లు ఉండవు
కర్నూలు(సెంట్రల్)/(అగ్రికల్చర్): కర్నూలు మార్కెట్ యార్డుకు రైతులు తెచ్చిన ఉల్లిగడ్డలను మంగళవారం కొనుగోళ్లు చేయబోరని జాయింట్ కలెక్టర్ నవ్య తెలిపారు. సోమవారం ఉల్లి భారీగా వచ్చే అవకాశం ఉందని, కొనుగోలు చేసిన సరుకును బయటికి పంపేందుకు కొంత సమయం అవసరం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె చెప్పారు. మార్కెట్ యార్డుకు మంగళవారం సెలవు ప్రకటించినట్లు తెలిపారు. తాడేపల్లిగూడెం మార్కెట్‌లో అమ్ముకున్నా మద్దతు ధర వర్తిస్తుందని పేర్కొన్నారు. కాగా.. మార్కెట్ యార్డులో మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసిన ఉల్లిగడ్డలను వేలంపాట ద్వారా విక్రయించే కార్యక్రమాన్ని ఆదివారం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ తనిఖీ చేశారు. ఉల్లిని క్వింటా కనిష్టం రూ.30 ప్రకారం, గరిష్టంగా రూ.900 ధరతో కొనుగోలు చేశారు. నాణ్యత లేదని 50 లాట్లు వ్యాపారులెవ్వరు కొనుగోలు చేయలేదు. నాణ్యత లేని ఉల్లిగడ్డలను మార్కెట్‌కు తెప్పిస్తున్నారని కమీషన్ ఏజెంట్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో వెలసిన శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. అదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరుకుని స్వామి అమ్మ వార్లను దర్శించుకున్నారు. వేకువ జామున పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూ లైన్లలో బారులుదీరారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూ లైన్లు నిండి పోయాయి. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులు కళకళలాడుతున్నాయి.

ముగిసిన పెథాలజీ వైద్యుల రాష్ట్ర సదస్సు