
హైకోర్టు సాధనకు రోడ్డెక్కుతాం
కర్నూలు(టౌన్): ఒకప్పటి రాజధాని, వెనుకబడిన ప్రాంతమైన కర్నూలులోనే హైకోర్టును ఏర్పాటు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు సువర్ణా రెడ్డి ప్రభ్వుత్వాన్ని డిమాండ్ చేశారు. బెంచ్ కాకుండా హైకోర్టు సాధనకు మరోసారి న్యాయవాదులు రోడ్డెక్కుతామని స్పష్టం చేశారు. గురువారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్‌లో లీగల్ సెల్ విభాగం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏడాదిన్నరగా రాష్ట్రంలో అరాచకపాలన సాగిస్తుందన్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతూ జైళ్లలో మగ్గిస్తుందన్నారు. ఈ ప్రభుత్వం రాయలసీమ ప్రాంత అభివృద్ధిని వదిలేసి కేవలం అమరావతికే ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి చెందాలనే సదుద్దేశంతో కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించారన్నారు. ప్రకటించడమే కాకుండా కర్నూలులో లోకాయుక్త, మానవ హక్కుల సంఘం, వక్ఫ్‌బోర్డు ట్రిబ్యునల్, సీబీఐ కార్యాలయం ఏర్పాటు చేశారన్నారు. అలాగే జగన్నాథ గట్టు వద్ద జాతీయ న్యాయ కళాశాల ఏర్పాటుకు భూమిపూజ చేశారన్నారు. కూటమి ప్రభుత్వం జాతీయ న్యాయ కళాశాలను తరలిస్తే అడ్డుకుంటామని వెల్లడించారు.
పీపీలు, ఏపీపీలను తొలగించడం అన్యాయం
కూటమి ప్రభుత్వం రాజకీయ కోణంలో పీపీలు, ఏపీపీలను తొలగించి అన్యాయం చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ లీగల్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొత్త అలవాటుకు శ్రీకారం చుట్టిందన్నారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారమే కాకుండా భారతీయ జనతా పార్టీ సైతం కర్నూలులో హైకోర్టు ఏర్పాటును సమర్థించిందన్నారు. చంద్రబాబునాయుడుకు చిత్తశుద్ది ఉంటే రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్‌డీఎ ప్రభుత్వం ఉన్నందున కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. లీగల్ సెల్ మాజీ జిల్లా అధ్యక్షుడు సుబ్బయ్య, వైఎస్సార్‌సీపీ మాజీ జిల్లా అధ్యక్షురాలు, న్యాయవాది సీట్రా సత్యనారాయణమ్మ మాట్లాడుతూ ఏడాదిన్నర చంద్రబాబు పాలనలో అరాచకం, కేసులు తప్ప అభివృద్ధి లేదన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు జూనియర్ లాయర్లకు స్టైఫెండ్ కింద రూ.5 వేలు కాకుండా ప్రతి నెలా రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారని, ఇప్పటి వరకు 10 పైసలు కూడా ఇవ్వలేకపోయారన్నారు. హైకోర్టు సాధన, జూనియర్ లాయర్లకు స్టైఫండ్ అమలు చేయాలన్న డిమాండ్లతో జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.