
స్ఫూర్తి కెరటం
రిజ్వర్ బ్యాంక్‌లో ఉద్యోగం...ఆరు అంకెల జీతం.. మెట్రో నగరాల్లో జీవితం..ఇంతకుమించి ఇంకేం కావాలనుకుంటారు ఎవరైనా..! కానీ ఇవేవి ఆమెకు సంతృప్తిని ఇవ్వలేదు...ప్రజా సర్వీసుల్లో తన కూతురుని చూడాలన్న తండ్రి ఆశయం ముందు.! అందకే ఆమె ఓ వైపు కుటుంబాన్ని, మరోవైపు ఉద్యోగం నిర్వహిస్తూనే సివిల్ సర్వీసెస్‌కు సన్నద్ధమయ్యారు. కఠోర శ్రమతో గ్రూప్–1 పరీక్షలో సత్తా చాటి తండ్రి కల నేరవేర్చారు ఎం.ఎన్. భార్గవి. ఎమ్మిగనూరు డీఎస్పీగా తొలి పోస్టింగ్‌ను అందుకుని, విధుల్లో చేరిన ఆమె ప్రయాణం యువతరానికి స్ఫూర్తిదాయకం. – ఎమ్మిగనూరు రూరల్
● బ్యాంక్ ఉద్యోగం చేస్తూ సివిల్స్‌కు ప్రిపేర్ ● తండ్రి కోరికను నెరవేర్చిన కుమార్తె
● ఎమ్మిగనూరు డీఎస్పీగా భార్గవికి మొదటి పోస్టింగ్
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు ఉద్యోగాలను వద్దనుకుని తన కల నెరువేర్చుకున్నారు ఇటీవల ఎమ్మిగనూరు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఎం.ఎన్ భార్గవి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం చెందిన జానార్దన్‌రావు, లలిత దంపతులకు ఎంఎన్. భార్గవి, దివ్య, మురళీకృష్ణ సంతానం. జానార్దన్‌రావు జనరల్ ఇన్సూరెన్స్‌లో పనిచేస్తూ రిటైర్డ్ అయ్యారు. తల్లి లలిత గృహిణి. వీరి మొదటి కుమార్తె ఎంఎన్.భార్గవి 10వ తరగతి వరకు తాడెపల్లిగూడెంలో, ఇంటర్ విజయవాడలో చదువుకున్నారు. ఆ తర్వాత వరంగల్‌లో ఈసీబీటీసీ (ఎన్‌ఐటీ)లో పూర్తి చేశారు. తన చెల్లెలు డాక్టర్ దివ్య హైదరాబాద్‌లో హోమియో ఎండీగా పనిచేస్తుండగా, తమ్ముడు డాక్టర్ మురళీకృష్ణ గ్యాస్టో ఎండీగా హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు. చెల్లి, తమ్ముడు డాక్టర్లు అయినా తను ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా తన లక్ష్యం గ్రూప్స్‌పైనే ఉండేది. వరంగల్‌లో ఈసీబీటీసీ చదువతుండగానే క్యాంపస్ సెలెక్షన్‌లో మోటో సెల్ ఫోన్ కంపెనీలో ఉద్యోగం పొంది హైదరాబాద్‌లో ఒక సంవత్సరం చేశారు. ఆ ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కు సన్నద్ధమయ్యారు. గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతూ బ్యాంక్ ఉద్యోగాలకు పరీక్ష రాయగా ఓరియంటెల్ బ్యాంక్‌లో ఉద్యోగం సాధించి 8 నెలలు పని చేశారు. ఆ క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ముంబాయిలోని రిజర్వ్ బ్యాంక్‌లో నాలుగున్నరేళ్లు పనిచేసి హైదరాబాద్ ఆర్‌బీఐకు బదిలీపై వచ్చారు. అక్కడ విధులు నిర్వహిస్తూనే సివిల్స్ మెయిన్స్‌కు ఎంపికై ఐఆర్‌టీసీ (రైల్వేశాఖ)లో ఉద్యోగం వచ్చినా అందులో చేరలేదు.
పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకోవాలి
ఎవరైనా అనుకున్న లక్ష్యానికి చేరుకోవాలంటే పట్టుదలతో చదవాలి. నేను గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎన్ని కష్టాలు ఎదురైనా వెనుకడుగు వేయలేదు. ఇప్పుడు ఉన్న సౌకర్యాలు అప్పుడు మాకు లేవు.. ఉన్న దాంట్లో కష్టపడి చదివాను. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో నా లక్ష్యాన్ని చేరుకున్నా. డీఎస్పీగా బాధితులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తా.
– ఎం.ఎన్. భార్గవి, డీఎస్పీ, ఎమ్మిగనూరు

స్ఫూర్తి కెరటం