
కేఎంసీలో ర్యాగింగ్‌పై మంత్రి ఆరా
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాల (కేఎంసీ)లో ర్యాగింగ్ ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరా తీశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ర్యాగింగ్ జోలికి వెళ్లాలంటేనే భయపడేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. యాంటి ర్యాగింగ్ కమిటి నివేదికను అందజేయాలని ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మను ఆదేశించారు. ఆమెతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. దీంతో కళాశాల ప్రిన్సిపల్, యాంటి ర్యాగింగ్ కమిటీ సభ్యులు శుక్రవారం రంగంలోకి దిగి వార్డెన్‌ను, హాస్టల్‌లో ప్రథమ, మూడవ సంవత్సరం విద్యార్థులతో చర్చించారు. ర్యాగింగ్‌కు పాల్పడితే విద్యార్థులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
వినాయక చవితి చందాల కోసమే
వివాదం..
కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ జరగలేదని, కేవలం వినాయక చవితి చందాల కోసమే వివాదం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ శుక్రవారం ప్రకటించారు. తాను, ర్యాగింగ్ కమిటీ సభ్యులు కలిసి విద్యార్థులతో కూర్చుని మాట్లాడినట్లు తెలిపారు. వారితో లిఖిత పూర్వక సమాధానాలు తీసుకున్నామని, ఎక్కడా కూడా విద్యార్థులు ర్యాగింగ్ చేసినట్లుగా లేదన్నారు. మొదటి సంవత్సవరం విద్యార్థులు వార్షిక పరీక్షలకు సిద్ధం అవుతున్నారని, ఈ సమయంలో ఉత్సవాల అంశాన్ని ర్యాగింగ్ పేరుతో ప్రచారం చేశారని, ఇది విద్యార్థులకు నష్టం కలిగిస్తుందని అన్నారు. విద్యార్థులు ఎవ్వరైనా ర్యాగింగ్‌కు గురైనట్లు తమ దృష్టికి తీసుకొస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.
పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశం