
ఆశల దీపాలు ఆరిపోయాయి!
ఎమ్మిగనూరురూరల్: మనస్పర్థలతో భర్తకు దూరంగా ఉన్న ఆమె తన కుమారుడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆయితే పదేళ్ల బాలుడు కాలువలో పడి మృతి చెందాడు. ఎమ్మిగనూరు మండలం గుడేకల్ గ్రామ పరిధిలోని తుంగభద్ర దిగువ కాలువలో ఈ దుర్ఘటన గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఎమ్మిగనూరు ఎస్‌ఎంటీ కాలనీలో సిద్ధపోగు శిరోమణి నివాసముంటున్నారు. ఈమె కుమారుడు సిద్ధపోగు రోహణ్(10) వీవర్స్ కాలనీ ప్రభుత్వ స్కూల్లో 4వ తరగతి చదువుతున్నాడు. పిల్లలకు ట్యూషన్ చెప్పుకుంటూ శిరోమణి డీఎీస్సీకి సిద్ధం అవుతున్నారు. ఈమె భర్త చరితబాబు.. కామవరంలోని పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఆదోనిలో నివాసముంటున్నాడు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావటంతో కొన్ని సంవత్సరాలు విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు. ఎక్కడికి వెళ్లవద్దు ఇంటి దగ్గరే ఉండు అని కుమారుడు రోహణ్‌కు చెప్పి తల్లి డీఎస్సీకి చదివేందుకు సమీపంలోని స్టడీ హాల్‌కు వెళ్లారు. తల్లి మాటలు వినకుండా బాలుడు గుడేకల్ గ్రామ పరిధిలోని తుంగభద్ర దిగువ కాలువకు వెళ్లి నీటిలో దిగి ఈతరాక మునిగిపోయాడు. కాలువ దగ్గర కాపలాగా ఉన్న మున్సిపల్ సిబ్బంది కొద్ది సేపు తర్వాత చూడటంతో బాలుడి మృతదేహం కనిపించింది. రూరల్ ఎస్‌ఐ శ్రీనివాసులు సమాచారం ఇవ్వడంతో పోలీసులను సంఘటన స్థలానికి పంపి బాలుడి మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్నట్లు రూరల్ ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.
వేర్వేరు చోట్ల ఈతకెళ్లి ముగ్గురు బాలురు మృత్యువాత

ఆశల దీపాలు ఆరిపోయాయి!