
మాట్లాడుతున్న చైర్మన్ శాంతిరాముడు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఇప్పటి వరకు స్పెషాలిటీ విభాగాల వైద్యులతో సమానంగా సూపర్ స్పెషాలిటీ కోర్సు పూర్తి చేసి ఆ విభాగాల్లో పనిచేస్తున్న వైద్యులకు కూడా సమాన వేతనం ఇస్తున్నారు. ఇకపై వీరికి అదనంగా నెలకు మరో రూ.30వేలు జతచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అలవెన్స్ ప్రకటించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరి ఎంటి.కృష్ణబాబు జీవో 446 విడుదల చేశారు. ఈ అలవెన్స్ ఆసుపత్రిలోని యురాలజీ, నెఫ్రాలజి, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, క్యాన్సర్, పీడియాట్రిక్ సర్జరీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ఎండోక్రైనాలజీ, ప్లాస్టిక్ సర్జరీ విభాగాల్లో పనిచేస్తున్న సూపర్‌స్పెషాలిటి వైద్యులందరికీ వర్తించనుంది. ఈ మేరకు ఆయా విభాగాల వైద్యులు హర్షం వ్యక్తం చేశారు.
కేఎంసీకి 15 మైక్రోస్కోప్‌లు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజిలో క్యాన్సర్ కేర్‌లో భాగంగా 15 మైక్రోస్కోప్‌లను శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి పంపింది. ఏపీఎంఎస్‌ఐడీసీ విభాగం వారు కొనుగోలు చేసి వీటిని కళాశాలకు పంపించారు. వీటిని కళాశాలలోని పెథాలజి విభాగంలో ఉపయోగించుకోనున్నారు.
‘పది’ సప్లిమెంటరీ
పరీక్షలు ప్రారంభం
కర్నూలు సిటీ: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లాలో 61 కేంద్రాల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం12.45 గంటల వరకు జరిగిన పరీక్షలకు 4,823 మందికి గాను 3,500 మంది హాజరుకాగా 1,323 మంది గైర్హాజరయ్యారు. పరీక్షకు అర గంట ముందు నుంచే కేంద్రాల్లోకి విద్యార్థులను తనిఖీలు నిర్వహించి పంపించారు. కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలు చేశారు.
ఈ కేవైసీ తప్పనిసరి
కర్నూలు(అగ్రికల్చర్): పెన్షనర్లు విధిగా ఈ–కేవైసీ చేసుకోవాలని జిల్లా ఖజానా అధికారి రామచంద్రరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 17,634 మంది పెన్షనర్లు ఉండగా ఇప్పటి వరకు 12,150 మంది ఈ కేవైసీ చేయించుకున్నారని, ఇంకా 5,484 మంది ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. పెన్షనర్లు అందరూ ఈ–కేవైసీ చేయించుకునేందుకు వీలుగా జిల్లాలోని ప్రతి సబ్ ట్రెజరీలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెల 4వ తేదీ ఆదివారం సెలవు అయిన్పటికీ అన్ని సబ్ ట్రెజరీలు పనిచేస్తాయని పేర్కొన్నారు.
ఐదు లక్షల కుటుంబాలకు వైఎస్‌ఆర్ బీమా
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో 6.76 లక్షల రైస్ కార్డు కుటుంబాలు ఉండగా 5,05,094 కుటుంబాలకు వైఎస్సార్ బీమా ఉందని డీఆర్‌డీఏ–వైకేపీ పీడీ వెంకటసుబ్బయ్య తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రైస్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి వైఎస్‌ఆర్ బీమా పొందే అర్హత ఉందన్నారు. ఈ ఏడాది రెన్యువల్‌తో పాటు మార్పులు, చేర్పులకు కూడా అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. రైస్ కార్డు ఉండి వైఎస్‌ఆర్ బీమా లేకపోతే వార్డు, గ్రామ వాలంటీర్ల ద్వారా నమోదు చేసుకోవచ్చని సూచించారు. 18–50 ఏళ్లలోపు వారు సాధారణంగా మరణిస్తే రూ. లక్షల, 18–70 ఏళ్ల లోపు పాలసీదారులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు పరిహారం లభిస్తుందని తెలిపారు. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి పేరుతో బీమా ఉండాలన్నారు. సర్వే జరుగుతున్నందున మార్పులు చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
‘శాంతిరాం’కు
అటానమస్ హోదా
పాణ్యం: నెరవాడ మెట్ట వద్ద ఉన్న శాంతిరాం ఇంజినీరింగ్ కళాశాలకు అటానమస్ హోదా లభించిందని కళాశాల చెర్మన్ మిద్దె శాంతిరాముడు తెలిపారు. శుక్రవారం ఆయన కళాశాలలో మాట్లాడుతూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి అటానమస్ స్టేటస్ గుర్తింపు రావడం సంతోషంగా ఉందన్నారు. 2009లో ప్రారంభమైన కళాశాలకు 2022లో ఎన్‌ఏఏసీ– ఏ గుర్తింపు లభించిందన్నారు. ఇటీవల యూజీసీకి సంబంధించిన ఐదుగురు సభ్యులు కళాశాలను పరిశీలించి ‘స్వతంత్ర ప్రతిపత్తి’ ధ్రువీకరించారన్నారు. పదేళ్లపాటు (2023–24 నుంచి 2032–33 వరకు) కళాశాలకు అటానమస్ హోదా కల్పించారన్నారు. ఇందుు కృషి చేసిన కళాశాల ప్రిన్సిపాల్ సుబ్రమణ్యం, వివిధ విభాగ అధిపతులకు ఆయన అభినందనలు తెలిపారు.