
చట్టాలపై అవగాహనతోనే న్యాయవాద వృత్తిలో రాణింపు
కర్నూలు (సిటీ): చట్టాలపై అవగాహనతోనే న్యాయవాద వృత్తిలో రాణించవచ్చునని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.హరిహరనాథ శర్మ అన్నా రు. ‘కెరీర్ ప్రాస్పెక్ట్స్ ఇన్ లా’ అనే అంశంపై స్థానిక ఓ న్యాయ కళాశాలలో జరిగిన సెమినార్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. లా విద్యార్థులు కోర్సు సమయంలోనే చట్టాలపై పరిజ్ఞానం పెంచుకుంటే కోర్టులలో సమర్థవంతంగా వాదించడానికి, సాక్షులను క్రాస్ ఎగ్జామ్ చేయడానికి ఉపకరిస్తుందన్నారు. సమాజంలో న్యాయవాద వృత్తికి ఎంతో ప్రాధాన్యం ఉందని, ప్రతి ఒక్కరూ న్యాయ సహాయం పొందేందుకు న్యాయవాదులను సంప్రదిస్తారన్నారు. చట్టాలపై అవగాహనతో పాటు ఆంగ్ల భాషపై ప్రావీణ్యం సాధించడం కూడా ముఖ్యమేనని తెలిపారు. ప్రసూనా న్యాయ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ పెంచలయ్య మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతమైన కర్నూలును విద్యాపరంగా అభివృద్ధిపరిచేందుకు తాను 1999లో కర్నూలులో న్యాయ కళాశాలను ప్రారంభించి వేలాది మందిని న్యాయవాదులుగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. సీనియర్ న్యాయవాది శ్రీనివాసులు మాట్లాడుతూ న్యాయవాద వృత్తిలో రాణించాలంటే కష్టపడి పనిచేసే తత్వం అలవరుచుకోవాలని కోరారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.శివాజీరావు మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులకు చట్టాలపై అవగాహన పెంచేందుకు పలు వెబ్‌సైట్లు సెమినార్లను నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో డీన్ డాక్టర్ జేవీ శివకుమార్, జూనియర్ న్యాయవాదులు, లా విద్యార్థులు పాల్గొన్నారు.
జస్టిస్ ఎ.హరిహరనాథ శర్మ