● జనార్దనపురం చోరీ కేసును ఛేదించిన పోలీసులు ● 16 గ్రాముల బంగారం, రూ.20 వేల నగదు స్వాధీనం ● మరో 26 గ్రాముల బంగారం రికవరీకి చర్యలు
నందివాడ: మండలంలోని జనార్దనపురం గ్రామంలోని ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుతో పాటు మరో రెండు దొంగతనం కేసుల్లో సంబంధం ఉన్న ముగ్గురు నిందితులను బుధవారం అరెస్టు చేశారు. వారి వద్ద 16 గ్రాముల బంగారం, రూ.20 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో 26 గ్రాముల బంగారాన్ని సామర్లకోటలోని ఓ ఫైనాన్స్ సంస్థ నుంచి స్వాధీనం చేసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ కేసు వివరాలను ఎస్ఐ సుబ్రహ్మణ్యం బుధవారం వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. జనార్దనపురం గ్రామానికి చెందిన మేకల ఏడుకొండలు ఇంటి తాళాలు పగులగొట్టి చొరబడిన ఆగంతకులు బంగారు వస్తువులు, రూ.5 వేల నగదు, ఒక సెల్‌ఫోన్‌ను చోరీ చేశారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు నందివాడ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. గుడివాడ రూరల్ సీఐ ఎస్.ఎల్.ఆర్. సోమేశ్వరరావు పర్యవేక్షణలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్ ఎస్ఐ ఆర్.త్రివర్ణ బృందం అందించిన శాసీ్త్రయ ఆధారాలతో నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 13న సాయంత్రం 5.30 గంటలకు కాకినాడ జిల్లా సామర్లకోటలోని పెన్షన్ లైన్, స్టీల్ కంపెనీ రోడ్డులో ఉన్న చిన్న దుర్గమ్మ ఆలయం వద్ద ప్రధాన నిందితుడు చుక్కపల్లి బాబి అలియాస్ ప్రవీణ్ కుమార్, అతనికి సహకరించిన పెద్దాడ హరికృష్ణ అలియాస్ పండు, మసకపల్లి విజయదుర్గను పోలీసులు అరెస్టు చేశారు. నందివాడ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన రెండు కేసులతోపాటు వీరవల్లి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసుల్లో చుక్కపల్లి బాబి, పెద్దాడ హరికృష్ణ, మసకపల్లి విజయదుర్గకు సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారి వద్ద 16 గ్రాముల బంగారం, రూ.20 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. సామర్లకోటలోని ఓ ఫైనాన్స్ సంస్థ వద్ద తనఖా పెట్టిన మరో 26 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టారు. ముగ్గురు నిందితులను గుడివాడ కోర్టులో హాజరుపరచగా వారికి జడ్జి 15 రోజుల రిమాండ్ విధించారు. ఎస్ఐ సుబ్రహ్మణ్యం, ఏఎస్ఐ వెంకటరావు, హెడ్ కానిస్టేబుల్ గంగరాజు, కానిస్టేబుళ్లు నాగరాజు, మహేష్, రామచంద్రరావు, కిరణ్, హోంగార్డు అజయ్ కేసును దర్యాప్తు చేశారు. వారిని పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.
విజయవాడలీగల్: బ్లేడుతో గాయపరచిన కేసులో నిందితుడికి ఏడాది జైలుశిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ బుధవారం 13వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎం.సుధ తీర్పునిచ్చారు. విజయనగరం జిల్లా గంట్యాడ గ్రామానికి చెందిన వ్యక్తి విజయవాడ గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దిబోట్ల వారి వీధిలోని ఓ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. 2022 ఏప్రిల్ మూడో తేదీ సాయంత్రం ఐస్‌క్రీమ్ బండి వద్దకు వెళ్లాడు. అదే సమయంలో కందుల విఘ్నేశ్వరరావు అలియాస్ విఘ్నేష్ అక్కడికి వచ్చి గంట్యాడకు చెందిన వ్యక్తిని డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోవడంతో విఘ్నేష్ తన వద్ద ఉన్న బ్లేడ్‌తో అతని మెడ, చేతి మీద గాయపరిచి పారిపోయాడు. ఈ ఘటనపై గవర్నర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు విఘ్నేష్‌ను అదే నెల నాలుగో తేదీన అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. ప్రాసిక్యూషన్ తరఫున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గీతా పూర్ణిమ, ప్రస్తుత ఇన్స్పెక్టర్ బాలమురళికృష్ణ, సీఎంఎస్ ఇన్స్పెక్టర్ వాసవి, సీఎంఎస్ సిబ్బంది పర్యవేక్షణలో ఆరుగురు సాక్షులను విచారించారు. నిందితుడిపై నేరం రుజువుకావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పునిచ్చారు.


