● తొలి రోజే వీఐపీల సేవలో
అధికార గణం
● క్యూలోనే సొమ్ముసిల్లి పడిన వృద్ధులు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): వసతులు లేకపోవడంతో తొలిరోజు దసరా ఉత్సవాలకు వచ్చిన భక్తులు గగ్గోలు పెట్టారు. అధికారులు.. వీఐపీల సేవలోనే ఉన్నారని, సామాన్యుడి ఇక్కట్లు పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని దుర్గమ్మ సన్నిధిలో సదరా ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు ఆదివారం భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం ఆలయంలో పూజలు ప్రారంభం, పలువురు వీఐపీలు తరలిరావటంతో మధ్యాహ్నం వరకూ ఆలయ అధికారులతో పాటుగా పోలీసు, ప్రొటోకాల్ తదితర ముఖ్యులందరూ ఆయా పనుల్లో నిమగ్నమయ్యారు.
క్యూ మేనేజ్‌మెంట్‌లో గందరగోళం
ఉత్సవాలకు 25 లక్షల మంది వస్తారని పదేపదే ప్రకటనలు గుప్పించిన అధికారులు తొలి రోజే అనేక విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. మొదటి రోజు భక్తుల రద్దీతో అందరూ చేతులు ఎత్తేసిన పరిస్థితి నెలకొంది.
క్యూలో ఉన్న భక్తుల సౌకర్యాలపైనా సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో వృద్ధులు, చిన్నారులు, మహిళలు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. తొలి రోజు పోలీసులు, ఇతర శాఖల అధికారులు క్యూలైన్ మేనేజ్‌మెంట్‌లో పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వినిపించాయి. భక్తులు క్యూలో సుమారు నాలుగైదు గంటలు ఉండటంతో ఆకలితో అలమటించారు.
ఉత్సవాల్లో టెక్నాలజీ ఫెయిల్!
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఉత్సవాల్లో తొలి రోజే టెక్నాలజీ పూర్తిగా ఫెయిలైంది. ఈ ఏడాది కొండపైకి వచ్చే వాహనాలను నియంత్రించడానికి దేవస్థానం, పోలీసు యంత్రాంగం కొత్త విధానానికి రూపకల్పన చేసింది. టీటీడీ స్థలం, టోల్‌గేట్‌తో పాటు ఘాట్‌రోడ్డులో బూమ్ బ్యారికేడ్లు, టర్న్‌స్టైల్స్ ఏర్పాటుకు లక్షలు వెచ్చించారు. ఆదివారం ఉదయమే టర్న్‌స్టైల్స్ విఫలం కాగా, సాయంత్రం నుంచి బూమ్ బ్యారికేడ్ల వ్యవస్థ కూడా విఫలమైంది. కొండపైకి ఇష్టానుసారంగా కార్లు, ఇతర వాహనాలను అనుమతించడంతో ఘాట్‌రోడ్డులోని టోల్‌గేట్ మొదలు ప్రొటోకాల్ కార్యాలయం వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఒక వైపున అమ్మవారి నగరోత్సవ సేవ, ప్రముఖుల కార్లతో కనీసం అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి కనిపించలేదు.
రాత్రి 8 నుంచి 9 గంటల వరకు వీఐపీ ప్రొటోకాల్ దర్శనాలకు అనుమతించడంతో పలువురు ప్రముఖులు కొండపైకి చేరుకునేందుకు పోటీ పడ్డారు. కార్లు, ఇతర వాహనాలతో పాటు ద్విచక్ర వాహనాలది సైతం ఇదే పరిిస్థ్ధితి. దీంతో ఓం టర్నింగ్ నుంచి ఇటీవల కొండ చరియలు విరిగి పడిన ప్రాంతం వరకు పూర్తిగా ద్విచక్ర వాహనాలతో నిండిపోయింది.


