లబ్బీపేట(విజయవాడతూర్పు): పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్న నాలుగేళ్ల చిన్నారి తన్మయికి విజయవాడ జీజీహెచ్‌లో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. ఆస్పత్రి ఈన్‌టీ విభాగాధిపతి డాక్టర్ కొణిదె రవి నేతృత్వంలో సీనియర్ కాక్లియర్ సర్జన్ డాక్టర్ రాయుడు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అనిత, అసిస్టెంట్ డాక్టర్ శ్రీనివాస్‌లు ఈ శస్త్ర చికిత్స నిర్వహించిన వారిలో ఉన్నారు. ఈ సర్జరీ నిర్వాహణకు ఎనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ ఎస్ వినయ్‌కుమార్, వైద్యులు కిరణ్, సుధారాణిలు తమవంతు సహకారం అందించారు. జీజీహెచ్‌లో తొలి కాక్లియర్ సర్జరీని విజయవతంగా నిర్వహించిన డాక్టర్ రాయుడు వైద్య బృందాన్ని శుక్రవారం వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏవైరావు అభినందించారు.
ఎ.కొండూరు: కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వృద్ధుడు మృతి చెందిన ఘటన మండల కేంద్ర పరిధిలోని చైతన్య నగర్‌లో గురువారం రాత్రి జరిగింది. స్థానిక బీసీ కాలనీకి చెందిన ఆలకుంట వీరాస్వామి (58) గడచిన ఎనిమిది సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. కొద్ది రోజులుగా ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీరాస్వామి గురువారం రాత్రి మృతి చెందాడు. ఆయనకు భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఈ కుటుంబానికి, పీహెచ్‌సీలో కిడ్నీ మందులు లభించకపోవడం శాపంగా మారింది. బయట షాపుల్లో మందులు కొనే స్ధోమత లేక వ్యాధి తీవ్రమై వీరస్వామి మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కంచికచర్ల: ఆటోను వెనుక నుంచి వేగంగా వస్తున్న లారీ ఢీకొనగా ఆటో డ్రైవర్ మృతి చెందిన ఘటన శుక్రవారం కంచికచర్ల పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ పి.విశ్వనాధ్ కథనం మేరకు.. నందిగామ మండలం చందాపురం గ్రామానికి చెందిన కనకపూడి కోటేశ్వరరావు(30) ఆటో డ్రైవర్. అతడు కంచికచర్ల నుంచి నందిగామ వెళ్తుండగా పేరకలపాడు క్రాస్ రోడ్డు దాటిన తర్వాత వెనుక నుంచి వస్తున్న లారీ అతడి ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో కోటేశ్వరరావు తలకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు అతడిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలియజేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ప్రమాద సమయంలో ఆటోలో ప్రయాణికులు లేకపోవడంతో పెనుముప్పు తప్పింది.
చేబ్రోలు: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. చేబ్రోలు ఎస్‌ఐ పి.వీర నారాయణ తెలిపిన వివరాలు.. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం మక్కాపేట గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్ స్థానికంగా ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బి.టెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. స్థానిక హాస్టల్‌లో ఉంటూ విద్యనభ్యసిస్తున్నాడు. వడ్లమూడి అడ్డరోడ్డు సమీపంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రేమ్ కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
పెడన(గూడూరు): గూడూరు మండలం చిట్టిగూడూరు సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయలపాలైన ఇద్దరు మహిళల్లో ఒకరు గుడివాడలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు.. చిట్టిగూడూరు మాజీ సర్పంచ్ వీర్ల కృష్ణ భార్య వీర్ల మహాలక్ష్మి(55), ఆమె ఆడపడుచు డొక్కు భారతలక్ష్మి గురువారం రాత్రి మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారిపై డివైడర్ దాటుతున్నారు. అదే సమయంలో వేగంగా వచ్చిన పల్సర్ బైక్ వీరిద్దరిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మహాలక్ష్మి తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావం అయింది. హుటాహుటిన బందరు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం గుడివాడకు తీసుకువెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మహాలక్ష్మి మృతి చెందింది.


