స్పీకర్ ఓంబిర్లా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లకు ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ: విజయవాడలో ఘనంగా నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ 2.0కు రావాలని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్‌లను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆహ్వానించారు. ఈమేరకు శుక్రవారం ఢిల్లీలో స్పీకర్ ఓంబిర్లాను, లక్నోలో సీఎం యోగిని కలసి వేర్వేరుగా కలిసిన ఈ ఇద్దరూ వారికి ఆహ్వాన పత్రాలను అందచేశారు. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మవారి సన్నిధిలో నిర్వహించే పవిత్ర దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాలని వారు కోరారు. విజయవాడకు ఉన్న విశిష్ట ఆధ్యాత్మిక ప్రాధాన్యత, ఘనమైన సాంస్కృతిక వారసత్వాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పే లక్ష్యంతో ఈ వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తి, సంప్రదాయాలు, కళలు, సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఈ ఉత్సవాల ద్వారా విజయవాడకు జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. ఉత్సవాల్లో ప్రముఖులు, భక్తులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఎంపీ కేశినేని శివనాథ్ ఆకాంక్షించారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): తమ ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయాలని, అప్పటి వరకూ వందశాతం గ్రాస్ శాలరీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టు వైద్య ఉద్యోగుల చేస్తున్న సమ్మె 4వ రోజు శుక్రవారం కూడా కొనసాగింది. విజయవాడ ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శిబిరంలో నాలుగో రోజు పెద్ద సంఖ్యలో కాంట్రాక్టు ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ ఉద్యోగాలు రెగ్యులర్ చేయాలని కోరుతూ ప్రజల మద్దతు కోసం సంతకాల సేకరణ చేపట్టారు. ఎంతోకాలంలో కాంట్రాక్డు ఉద్యోగులుగా రోగులకు సేవలు అందిస్తున్నామని, కరోనా సమయంలో సైతం ప్రాణాలకు తెగించి సేవలు అందించామన్నారు. కానీ తమను రెగ్యులర్ చేసే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకూ సమ్మె విరమించేది లేదని తేల్చి చెపుతున్నారు.
భవానీపురం(విజయవాడపశ్చిమ): సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యాన జిజ్ఞాస ఆర్ట్ వర్క్ నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్–2.0 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మిసెస్ విజయవాడ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళలు తమ విభిన్న ప్రతిభతో ఆకట్టుకున్నారు. వివిధ రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే వస్త్రధారణతో అలరించారు. టాలెంట్ రౌండ్‌లో నృత్యం, సంగీతం, మిమిక్రీ, వెంట్రిలాక్విజం, యాంకరింగ్, థీమాటిక్ కాస్ట్యూమ్స్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కేశినేని జానకి లక్ష్మి, బొండా సుజాత మాట్లాడుతూ మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అందాల పోటీలు కేవలం బాహ్య సౌందర్యానికి మాత్రమే పరిమితం కాకుండా వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత ప్రతిబింభించేలా ఉండాలని సూచించారు.


