అలంకార ప్రాయంగా విజయవాడలోని ప్రసూతి కేంద్రాలు సిబ్బంది ఉన్నా, వైద్యులు లేక సేవలు మృగ్యం వైద్యుల నియామకంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వైద్య పరీక్షలకు జీజీహెచ్‌కు వెళ్లాల్సిందే.. సమీపంలోనే ఆస్పత్రి ఉంటే గర్భిణులకు ఎంతో మేలు
వైద్యులను నియమించాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ వైద్య రంగాన్ని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా చంద్ర బాబు సర్కారు అడుగులు వేస్తోంది. అందుకు విజయవాడలోని నాలుగు ప్రసూతి కేంద్రాలే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. కొన్నాళ్లుగా వాటిలో వైద్యులు లేక, ఆ భవనాలు అలంకార ప్రాయంగా మిగిలాయి. దీంతో నగరంలోని 12లక్షల మంది జనాభాకు ప్రసూతి సేవలకు జీజీహెచ్ పెద్దదిక్కుగా మారింది. అందరూ అక్కడికే వెళ్లడంతో అక్కడ పడకలు చాలక ఒక్కో బెడ్‌పై ఇద్దరు, ముగ్గురు గర్భిణులు ఉండాల్సిన దయనీయ స్థితి నెలకొంది. రాజధానికి సమీప నగరమైన విజయవాడలోనే పరిస్థితి ఇలా ఉంటే, ఇతర ప్రాంతాల పరిస్థితి ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రజల నివాస ప్రాంతాలకు చేరువలో ప్రసూతి సేవలు అందించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నీరు గారుస్తోందని విమర్శలు వస్తున్నాయి.
శిలావిగ్రహాలే..
● రాణీగారితోట సిమెంట్ గోడౌన్ ప్రాంతంలో కొన్నేళ్ల కిందట వంగవీటి మోహనరంగా ప్రసూతి కేంద్రం ఏర్పాటు చేశారు. ఇది కొంతకాలంగా మూతపడి ఉంది.
● కృష్ణలంకలో యూపీహెచ్‌సీ పక్కనే ప్రసూతి ఆస్పత్రి ఉంది. అక్కడ ఏఎన్‌ఎంలు, హెచ్‌వీ ఇతర సిబ్బంది ఉన్నారు. కానీ వైద్యులు లేక పోవడంతో వాళ్లు ఏమీ చేయలేని దయనీయ స్థితి నెలకొంది. ఎవరైనా గర్భిణులు వస్తే పక్కనే ఉన్న యూపీహెచ్‌సీకి పంపుతున్నారు. అలాంటప్పుడు ఈ ఆస్పత్రి ఉపయోగం ఏమిటో అధికారులకే తెలియాలి.
● రామరాజ్యనగర్, రాజీవ్‌నగర్ ఆస్పత్రుల పరి స్థితి కూడా ఇలాగే ఉంది. ఒకప్పుడు రాజీవ్ నగర్ ఆస్పత్రిలో ఇన్ పేషెంట్లు కూడా ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
శ్రద్ధ చూపని అధికారులు..
ప్రసూతి సేవల కోసం గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే ఖర్చుతో కూడుకోవడంతో అన్ని ప్రాంతాలకు చెందిన వారు జీజీహెచ్‌లోని ప్రసూతి విభాగానికి వెళ్లాల్సి వస్తోంది. దీంతో అక్కడ విపరీతమైన రద్దీ నెలకొంటోంది. ఎక్కువ మంది రావడంతో సేవల్లో కూడా జాప్యం ఏర్పడుతోంది. అదే నగరంలోని ప్రసూతి ఆస్పత్రుల్లో సేవలు అందుబాటులో ఉంటే క్లిష్టమైన కేసులను అక్కడకు పంపించవచ్చు. కానీ ఆ దిశగా అధికారులు ఆలోచన చేయడం లేదు.
సిబ్బందికి పనిలేదు..
ఇప్పుడు నగరంలో ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహించేందుకు సచివాలయ హెల్త్ సెక్రటరీలు అందు బాటులోకి వచ్చారు. హెల్త్ సర్వేలు కూడా వాళ్లే చేస్తున్నారు. దీంతో వీఎంసీ ఆస్పత్రిలో ఉన్న సిబ్బంది పనిలేక ఖాళీగా ఉంటున్నట్లు చెబుతున్నారు. సుమారు 12మంది ఏఎన్‌ఎంలు, నలుగురు హెచ్‌వీలు, ఒక హెల్త్ ఎడ్యుకేటర్, నలుగురు వాచ్‌మ్యాన్‌లు, నలుగురు అటెండర్‌లు ప్రసూతి ఆస్పత్రుల్లో ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం వారు వ్యాక్సినేషన్, పల్స్‌పోలియో వంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదంటున్నారు. ఒకవైపు వైద్య శాఖలో సిబ్బంది కొరతతో ఇబ్బంది పడుతుంటే, అక్కడ మాత్రం వారిని ఖాళీగా ఉంచి జీతాలు చెల్లిస్తున్నారంటూ పలువురు ఆరోపిస్తున్నారు.
నగరంలో నిరుపయో గంగా ఉన్న ప్రసూతి కేంద్రాల్లో వైద్యులను నియమించాలి. ప్రజల నివాస ప్రాంతాలకు చేరువలో ప్రసూతి సేవలు అందుబాటులోకి తేవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. నాలుగు ప్రసూతి కేంద్రాల్లో వసతులు కల్పించి, వైద్యులను నియమించాలి. గర్భిణులకు అవసరమైన స్కానింగ్‌లను కూడా అక్కడే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి.
– యర్రంశెట్టి అంజిబాబు,
రాష్ట్ర అధ్యక్షుడు, ప్రజాకాపునాడు


