జీవితం ఓ అద్భుత ప్రయాణం.. ఈ పయనంలో మనకు తోడుగా, నీడగా నిలిచే అనుబంధాల్లోకెల్లా స్నేహం అత్యంత మధురమైనది, విలువైనది. రక్తసంబంధం లేకున్నా, ఆత్మ బంధాన్ని పెంచే మనసులతో పెనవేసుకునే ఈ బంధం, సంతోషాన్ని ద్విగుణీకృతం చేస్తుంది.. కాలంతో పాటు అది మరింత గాఢమవుతుంది. ఈ చిత్రం చూడండి.. ఇక్కడ కనిపిస్తున్న వృద్ధురాలు ఎవరూ లేని ఒక మానసిక వికలాంగురాలు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఈడేపల్లిలో ఉన్న జట్టి నరసింహం ప్రభుత్వ వృద్ధాశ్రమంలో తల దాచుకుంటోంది. ఈమె పేరు నండూరి బాలమణి. మూడేళ్ల క్రితం పెడన రోడ్డులో కుక్కపిల్లతో అనాథగా సంచరిస్తున్న ఈమెను ఓ వ్యక్తి పోలీస్‌లకు అప్పగించాడు. పోలీసులు ఆమెను ఈ వృద్ధాశ్రమంలో చేర్పించారు. ఆమెతో పాటే ఆ కుక్క కూడా ఆ వృద్ధాశ్రమానికి వలస వచ్చి ఆమెతో పాటే బతుకుతోంది. కుక్కను ‘బుజ్జి’ అంటూ ప్రేమతో పిలుస్తూ అన్నపానాలు ఇస్తుండటంతో పాటు స్నానం సైతం చేయిస్తోంది. వృద్ధాశ్రమంలో ఒకే మంచంపై స్నేహ పూర్వకంగా ఉంటున్న బాలామణి– కుక్కను చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. స్నేహానికి ఏ భేదం ఉండదనే నానుడికి వీరి స్నేహం నిదర్శనంగా నిలుస్తోంది. – మచిలీపట్నం టౌన్


