గాలిలో దీపంలా సాగు! | - | Sakshi
Sakshi News home page

గాలిలో దీపంలా సాగు!

Jul 30 2026 5:24 AM | Updated on Jul 30 2026 5:24 AM

ప్రీమియం భారంతో బీమాకు దూరమవుతున్న అన్నదాతలు

ఎల్‌నినో ప్రభావంతో

ఈ ఏడాది తగ్గిన పంటల సాగు

ఇప్పటికే సాగు చేసిన వరి

దెబ్బతింటుండటంతో ఆందోళన

గతంలో బీమా ప్రీమియం చెల్లించి అండగా నిలిచిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం

కొన్ని పంటలకు రేపటితో ముగుస్తున్న బీమా ప్రీమియం చెల్లింపు గడువు

రైతులకు ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది

ప్రతి రైతుకూ బీమా

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఎన్టీఆర్‌ జిల్లాలో ప్రధాన మంత్రి ఫసల్‌బీమా యోజన పథకం నూరు శాతం నమోదు లక్ష్యంగా కార్యచరణ చేపట్టాలని కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టర్‌ లక్ష్మీశ.. జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియ, జిల్లాస్థాయి అధికారులతో కలసి కలెక్టర్‌ కార్యాలయం నుంచి ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వివిధ శాఖల క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన కింద విత్తనం నాటిన ప్రతి రైతును తప్పనిసరిగా పంటల బీమా పరిధిలోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. పంట మార్పిడిపై ప్రతి మండల వ్యవసాయ అధికారి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, ఇప్పటి వరకు ఎంతమంది రైతులు ఎంత విస్తీర్ణంలో పంట మార్పిడి చేపట్టారో సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

ఎరువుల సమస్యలపై కాల్‌ సెంటర్‌..

ఎరువుల విషయంలో రైతులకు సమస్యలు ఎదురైతే కలెక్టరేట్‌ యూనిఫైడ్‌ కాల్‌ సెంటర్‌ (91549 70454)ను సంప్రదించే విధంగా అన్ని ఎరువుల దుకాణాల వద్ద హెల్ప్‌లైన్‌ నంబర్‌ను స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు.

సాక్షి, విజయవాడ: ఎల్‌నినో ప్రభావం ఒకవైపు.. ప్రభుత్వ సహాయ నిరాకరణ మరోవైపు.. వెరసి ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా రైతులు విలవిల్లాడుతున్నారు. ఇప్పటికే తీవ్ర వర్షాభావంతో అల్లాడుతున్న అన్నదాతలను కాపాడాల్సిన చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా వర్తింపజేసే పంటల బీమాకు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రీమియం నగదు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించి ఆదుకోవాల్సి ఉండగా.. రైతులే ప్రీమియం కట్టాలని ప్రభుత్వం చెబుతోంది. అసలే కష్టనష్టాలతో ఇబ్బంది పడుతున్న అన్నదాత ఇప్పుడు ప్రీమియం చెల్లించడానికి మొగ్గు చూపడం లేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇక్కడ అధికశాతం వరి సాగు అవుతోంది. అయితే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని, వరి సాగు చేయొద్దని ప్రభుత్వం రైతులకు చెబుతోంది.

ఏదీ నాటి భరోసా?

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు అండగా పంటల బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించేది. తద్వారా రైతులకు పంట నష్టం జరిగినప్పుడు, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోతే ఆ సీజన్‌లోనే పరిహారం రైతుల ఖాతాల్లో జమ చేసేవారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం బీమా ప్రీమియం రైతులే చెల్లించాలని చెబుతోంది. గత్యంతరం లేక కొందరు ప్రీమియం చెల్లిస్తుండగా, మరికొందరు మాత్రం కనీసం ఆసక్తి చూపడం లేదు. మరోవైపు బస్తా యూరియా కోసం తాము అగచాట్లు పడుతున్నామని, ఇంక పంట నష్టపోతే పరిహారం ఇస్తారన్న నమ్మకం లేదని రైతులు చెబుతున్న పరిస్థితి. అసలే ఎల్‌నినో ప్రభావంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న అన్నదాతలకు అండగా నిలవాల్సిన తరుణంలో ప్రభుత్వం మొండిచేయి చూపుతోంది.

రేపటితో ఆఖరు..

వాతావరణ ఆధారిత, పీఎం ఫసల్‌ బీమా పథకాల కింద ప్రభుత్వం నోటిఫై చేసిన పంటలకు ప్రీమియం చెల్లించేందుకు ఈ నెల 31తో గడువు ముగియనుంది. వరి పంటకు మాత్రం ఆగస్టు 15 వరకు గడువు ఉంది. క్షేత్రస్థాయికి వెళ్లి రైతులు సాగు చేసిన పంటను పరిశీలించి బీమా ప్రీమియం కట్టించేలా అవగాహన కల్పించాల్సిన వ్యవసాయ అధికారులు, కిందిస్థాయి సిబ్బంది రైతు సేవా కేంద్రాల్లోనే నమోదు చేయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 2022 అధికారిక గణాంకాల ప్రకారం 3.76 లక్షల హెక్టార్లలో పంటలు సాగవుతాయి. ఇందులో సాగు నీరు కింద 2.42లక్షల హెక్టార్లు ఉంది. కొన్ని పంటలకు ప్రీమియం ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లించాలని రైతులు కోరుతున్నా.. చంద్రబాబు సర్కారు నుంచి కనీస స్పందన లేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పీఎంఎఫ్‌బీవై కింద వరి(అత్యధిక విస్తీర్ణం)కి ఎకరాకు రూ.850(ఆగస్టు 15 వరకు గడువు ఉంది), ఎర్రమిరపకు రూ.1800, మొక్కజొన్నకు ఎకరాకు రూ.370, పత్తికి రూ.1900(ఈ నెల 24వ తేదీకి గడువు ముగిసింది), పెసలుకు రూ.360 చొప్పున బీమా కట్టాల్సి ఉంది. కానీ ఉమ్మడి జిల్లాలో బీమా నమోదు శాతం చాలా తక్కువగా ఉంది.

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం క్రాప్‌ ఇన్సూరెన్స్‌ చేయించేందుకు నగదు చెల్లించేది. పంట నష్టపోయినప్పుడు రైతులకు ఇన్సూరెన్స్‌ నగదు అందేది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం చెల్లించే ప్రీమియం ఎత్తి వేయడంతో రైతులకు ఇన్సూరెన్స్‌ చేయించడం ఆర్థిక భారంగా మారి ఆసక్తి చూపడం లేదు. దీనివల్ల పంట నష్టపోయినప్పుడు రైతులు అప్పులపాలవుతున్నారు. ప్రభుత్వం ఇకనైనా తీరు మార్చుకొని ఉచితంగా ఇన్సూరెన్స్‌ చేయించాలి.

– చెరుకూరి శ్రీనివాసరావు, రైతు సంఘం నాయకుడు, కవులూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement