ప్రకృతి మాతా ప్రణామం | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి మాతా ప్రణామం

Jul 30 2026 5:24 AM | Updated on Jul 30 2026 5:24 AM

పూర్ణాహుతితో ముగిసిన శాకంబరీ ఉత్సవాలు

ఫలపుష్పాదులతో దుర్గమ్మ దర్శనం

మూడో రోజున భక్తుల రద్దీ

కొనసాగుతున్న ఆషాఢ సారె సంబరాలు

పౌర్ణమి నేపథ్యంలో ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ

శాస్త్రోక్తంగా పూర్ణాహుతి..

పూర్ణాహుతితో ముగిసిన శాకంబరీ ఉత్సవాలు

గిరిప్రదక్షిణలో పాల్గొన్న భక్తజనం

వివిధ ఫలాలతో ఉత్సవమూర్తి

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో మూడు రోజులుగా జరుగుతున్న శాకంబరీ ఉత్సవాలు బుధవారంతో ముగిశాయి. ఉత్సవాలలో మూడో రోజున అమ్మవారికి డ్రై ఫ్రూట్స్‌తో అలంకరించగా, అమ్మవారి ప్రధాన ఆలయాన్ని వివిధ రకాల పండ్లు, కాయలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మరో వైపున ఆషాఢ పౌర్ణమి నేపథ్యంలో తెల్లవారుజామున దుర్గగుడి ఘాట్‌రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం నుంచి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. సుమారు 8 కిలోమీటర్ల మేర సాగిన ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణలో పెద్ద ఎత్తున భక్తులు, అమ్మవారి సేవకులు, సిబ్బంది పాల్గొన్నారు.

45 టన్నుల కూరగాయలు,

2.5 లక్షల మంది భక్తులు

శాకంబరీ ఉత్సవాలలో మూడు రోజులలో 45 టన్నుల కూరగాయలను ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయం, ఇతర ఉపాలయాల అలంకరణకు వినియోగించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. మూడు రోజుల ఉత్సవాలలో మొత్తం 2.50 లక్షల మంది భక్తులు అమ్మవారికి శాకంబరీగా దర్శించుకున్నారని పేర్కొన్నారు. ఉత్సవాలలో మొదటి రెండు రోజులు ఆకు కూరలు, కాయగూరలతోనూ, మూడో రోజున డ్రైఫ్రూట్స్‌తో అలంకరించారు. బంగారు గోపుర ప్రాకారం చుట్టూ బత్తాయిలు, కమలాలు, పైనాపిల్‌, డ్రాగన్‌ ఫ్రూట్స్‌, యాపిల్‌, ఆల్‌బక్రా, ద్రాక్షలతో అలంకరించారు. శాకంబరీ ఉత్సవాలను పురస్కరించుకుని మూడు రోజుల పాటు జరిగిన కదంబ ప్రసాద వితరణపై భక్తులు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9.30గంటల వరకు నిర్విరామంగా కదంబ ప్రసాదాన్ని భక్తులకు అందించామని ఆలయ ఈవో శీనానాయక్‌ పేర్కొన్నారు. రాజగోపురం ఎదుట మంచుతో ఏర్పాటు చేసిన శివలింగం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

వైభవంగా గిరి ప్రదక్షిణ..

ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకొని బుధవారం తెల్లవారుజామున ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ ఘాట్‌రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమైంది. కామథేను అమ్మవారి ఆలయం వద్ద దేవస్థాన ప్రచార రథానికి ఆలయ ఈవో శీనానాయక్‌, చైర్మన్‌ రాధాకృష్ణలతో పాటు ట్రస్ట్‌ బోర్డు సభ్యులు, ఆలయ అర్చకులు రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి, ఇతర అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించి గిరిప్రదక్షిణను ప్రారంభించారు. ఘాట్‌రోడ్డు నుంచి ప్రారంభమైన గిరిప్రదక్షిణ కుమ్మరిపాలెం, విద్యాధరపురం, సితారా, కబేళా, పాలప్రాజెక్టు, కేఎల్‌రావు నగర్‌, చిట్టినగర్‌, బ్రాహ్మణ వీధి మీదుగా ఆలయానికి చేరుకుంది. ఆషాఢ మాసం, గురు పౌర్ణమి వేళ ఆదిదంపతులైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లు మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ తమ ఇంటి ముంగిటకు విచ్చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందంటూ భక్తులు పూజా సామగ్రి సమర్పించి పూజలు జరిపించుకున్నారు.

పౌర్ణమి వేళ.. ఆర్జిత సేవా భాగ్యం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఆషాఢ పౌర్ణమి, శాకంబరీగా దుర్గమ్మ దర్శనం, ఆషాఢ సారె ఉత్సవాల నేపథ్యంలో బుధవారం ఆదిదంపతులకు నిర్వహించిన ఆర్జిత సేవలకు డిమాండ్‌ ఎక్కువగా కనిపించింది. తెల్లవారుజామున ప్రధాన ఆలయంలో సుప్రభాత సేవ, మూలవిరాట్‌కు నిర్వహించే ఖడ్గమాలార్చనకు పెద్ద ఎత్తున ఉభయదాతలు పాల్గొన్నారు. అమ్మవారి ఖడ్గమాలార్చనలో 27 మంది ఉభయదాతలు రెండు షిఫ్టులలో పూజను జరిపించుకున్నారు. ఇక ఆలయ ప్రాంగణంలోని నూతన పూజా మండపంలో నిర్వహించిన లక్ష కుంకుమార్చనలో 11 మంది, శ్రీచక్రనవార్చనలో 17 మంది, యాగశాలలో చండీహోమంలో 174 టికెట్లకు విక్రయించారు. దీంతో సుమారు మూడువందల మంది భక్తులు యాగశాలలో ప్రత్యక్షంగా పాల్గొని తమ నామగోత్రాలతో హోమం జరిపించుకున్నారు. ఇక సాయంత్రం అమ్మవారికి జరిగిన పంచహారతుల సేవలో పాల్గొనేందుకు నగరానికి చెందిన పలువురు ప్రముఖులు పోటీ పడ్డారు.

శాకంబరీ ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో ఆలయ వైదిక కమిటీ పర్యవేక్షణలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ఈవో శీనానాయక్‌ దంపతులు, చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ దంపతులతో పాటు ట్రస్ట్‌ బోర్డు సభ్యులు పాల్గొనగా, ఆలయ స్థానాచార్య శివప్రసాద్‌ శర్మ, ప్రధాన అర్చకులు ఎల్‌డీ, ప్రసాద్‌, ఇతర వేద పండితులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement