విజయవాడ డివిజన్‌ ఉద్యోగికి జీఎం సేఫ్టీ అవార్డు | - | Sakshi
Sakshi News home page

విజయవాడ డివిజన్‌ ఉద్యోగికి జీఎం సేఫ్టీ అవార్డు

Jul 30 2026 5:24 AM | Updated on Jul 30 2026 5:24 AM

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): విధుల్లో అప్రమత్తంగా వ్యవహరిస్తూ అవాంఛనీయ ఘటనలను నివారించడంలో కృషి చేసిన విజయవాడ డివిజన్‌ ఉద్యోగి ఎం.రమేష్‌ బాబు దక్షిణ కోస్తా రైల్వే జీఎం సందీప్‌ మాథ్యర్‌ చేతుల మీదుగా ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మంత్‌ సేఫ్టీ అవార్డు’ అందు కున్నారు. జోనల్‌ హెడ్‌ క్వార్టర్స్‌ విశాఖపట్నంలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో జోన్‌ వ్యాప్తంగా విధుల్లో అప్రమత్తత చూపించిన ఉద్యోగులకు అవార్డులను అందించారు. అందులో విజయవాడ డివిజన్‌కు చెందిన ఎం.రమేష్‌బాబు జూన్‌ 2న మధ్యాహ్నం 12.05 గంటల సమయలో గూడ్స్‌ రైలు చీరాల స్టేషన్‌ దాటుతుండగా అందులోని రెండు వ్యాగన్‌లలో ఐరన్‌ కాయిల్స్‌ను పట్టి ఉంచే ఇనుప పట్టీలు విరిగిపోయి ఉండటాన్ని గమనించాడు. వెంటనే స్పందించి.. లోకోపైలెట్‌, స్టేషన్‌ మాస్టర్‌, సంబంధిత కంట్రోల్‌ సిబ్బందిని అప్రమత్తం చేశాడు అనంతరం రైలును వేటపాలెంలో నిలిపి సత్వర చర్యలు చేపట్టారు.

ఐటీఐలో అడ్మిషన్ల

ప్రక్రియ ప్రారంభం

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో ప్రవేశానికి రెండో విడత అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించామని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్‌, ఐటీఐ కౌన్సెలింగ్‌ ఎన్టీఆర్‌ జిల్లా కన్వీనర్‌ ఎం. కనకారావు ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 3వ తేదీలోగా ఐటీఐఅడ్మిషన్స్‌.ఏపీ.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆగస్టు 6వ తేదీన విజయవాడ రమేష్‌ ఆస్పత్రి రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పూర్తి చేసేందుకు విజయవాడలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో ప్రత్యేకంగా హెల్ప్‌ డెస్క్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. వివరాలకు 0866–2475575, 94906 39639, 77804 29468లో సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు.

అనుమతులు లేని భవనాల కూల్చివేత

పెనమలూరు: తాడిగడప మునిసిపాలిటీలో అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలపై బుధవారం అధికారులు చర్యలు తీసుకున్నారు. మునిసిపాలిటీ కమిషనర్‌ షేక్‌ నజీర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కానూరు డాక్టర్స్‌ కాలనీ, తాడిగడప డొంక రోడ్డులో అనుమతులు లేకుండా భవనాల నిర్మాణం చేశారన్నారు. మునిసిపాలిటీ చట్టానికి విరుద్ధంగా భవనాలు నిర్మాణం చేసినందున నోటీసులు జారీ చేశామని అన్నారు. నిర్ణీత సమయంలో యజమానులు అక్రమ కట్టడాలు తొలగించకపోవటంతో టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు భవనాలను కూల్చారని అన్నారు. తాడిగడప మునిసి పాలిటీలో నిర్మాణాలు చేపట్టే యజమానులు ముందస్తుగా ప్లాన్‌లు మంజూరు చేసుకోవాలని తెలిపారు. మంజూరైన ప్లాన్‌ల ప్రకారం భవనాల నిర్మాణం చేయాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వైద్య కళాశాలకు విరాళంగా గోల్డ్‌ మెడల్‌

లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో ఆ కళాశాల పూర్వ విద్యార్థి(1987 బ్యాచ్‌), రేడియాలజిస్ట్‌ డాక్టర్‌ వీఎన్‌ వరప్రసాద్‌ గోల్డ్‌మెడల్‌ విరాళాన్ని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆలపాటి ఏడుకొండలరావుకు అందజేశారు. ఏటా బెస్ట్‌ అవుట్‌గోయింగ్‌ విద్యార్థికి ఈ గోల్డ్‌మెడల్‌ను అందించనున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఏడుకొండలరావు మాట్లాడుతూ వైద్య విద్యార్థుల ప్రతిభను మరింత ప్రోత్సహించేలా గోల్డ్‌మెడల్‌ విరాళం అందజేయడం అభినందనీయం అన్నారు. డాక్టర్‌ వీఎన్‌ వరప్రసాద్‌ విరాళం మరెందరో పూర్వ విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement