కలెక్టర్ డీకే బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో ఖరీఫ్– 2026 సీజన్‌కు సంబంధించి తూర్పు డెల్టా ఆయకట్టుకు నీటి లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో రైతులకు సాగునీరు ఇవ్వలేమని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో 44వ సాగునీటి సలహామండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సూపర్ ఎల్‌నినో తీవ్ర ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని కృష్ణ తూర్పు డెల్టా ఆయకట్టుకు నీటి లభ్యత, తాగునీటి సరఫరాపై సమీక్షించారు.
అడుగంటిన జలాశయాలు..
కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలకు ఇన్‌ఫ్లో లేదన్నారు. ఒక వేళ నీరు వస్తే ప్రథమ ప్రాధాన్యంగా తాగునీటి కోసం నిల్వ చేయాల్సిన అవసరం ఉందన్నారు. పులిచింతల ప్రాజెక్టులో 45 టీఎంసీలకు గానూ 29 టీఎంసీల నీరు నిల్వ ఉందని, అందులో వినియోగించుకోగలిగిన నీరు 25 టీఎంసీలు మాత్రమే ఉంటుందన్నారు. అంతేకాకుండా పట్టిసీమ నుంచి పోలవరం కుడికాలువ ద్వారా నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ గోదావరిలో కూడా ఎప్పుడూ చూడని విధంగా నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టిందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు ప్రస్తుతం వరిసాగు వైపు మరలకుండా అవకాశం ఉన్న చోట్ల ఆరుతడి పంటలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
పరిహారం ఇవ్వండి..
కొంత మంది సభ్యులు రైతులు ఇప్పటికే నాట్లు పూర్తి చేశారని వారి పరిస్థితి ఏమిటని కనీసం ఆ రైతులకు నష్టపరిహారమైనా ఇప్పించాలని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ సభ్యుల విజ్ఞప్తి మేరకు తాము ప్రభుత్వానికి లేఖ రాస్తామన్నారు. ఇరిగేషన్ ఎస్‌ఈ జె. గుణకరరావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి జ్యోతిరమణి, కృష్ణ తూర్పు డెల్టా ప్రాజెక్టు కమిటీ అధ్యక్షుడు దేవనబోయిన వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు వల్లూరిపల్లి గణేష్, డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షుడు, నీటి వినియోగదారుల సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.


