● ‘‘ఇంటింటికీ తెలుగుదేశం’’లో
రచ్చకెక్కిన విభేదాలు
● ఎమ్మెల్యే ముందే ఒకరిపై
ఒకరు దూషణలు
ఉయ్యూరు: టీడీపీలో అంతర్గతంగా ఉన్న కుమ్ములాటలు బట్టబయలయ్యాయి. కృష్ణాజిల్లా ఉయ్యూరుపై ఆధిపత్యం కోసం తమ్ముళ్లు తన్నుకునే వరకూ వెళ్లారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఎదుటే ఒకరిపై ఒకరు వాదులాటకు దిగి దుర్భాషలాడుకున్నారు. నువ్వెంత...నీ స్థాయెంత అంటూ తోపులాటకు దిగారు. మంగళవారం రాత్రి టీడీపీ చేపట్టిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం వేదికగా తమ్ముళ్ల మధ్య పోరు నెలకొంది. ఉయ్యూరు టీడీపీలో గత కొంతకాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. అధికారం, కాంట్రాక్టులు, ఆదాయ వనరుల అజెండాగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గర నుంచి తమ్ముళ్ల మధ్య అంతర్గత యుద్ధం జరుగుతోంది. పార్టీ నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయారు. కార్యక్రమాలు కూడా ఒంటెత్తు పోకడలుగా సాగుతుండటంతో శ్రేణుల్లో అసంతృప్తి నెలకొంది. మున్సిపాలిటీ వేదికగా సాగుతున్న ఈ తంతు ఇంటింటికీ తెలుగుదేశంలో బహిర్గతమైంది. కాపుల రామాలయం సెంటరులో ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ సమక్షంలోనే పార్టీ నాయకులు వంగవీటి శ్రీనివాసప్రసాద్, కూనపరెడ్డి వాసు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో దూషణలకు దిగి తోపులాట వరకూ వెళ్లారు. అధికారం, పదవులు, కాంట్రాక్టులు అన్నీ ఒకరిద్దరికే ఎలా కట్టబెడతారంటూ వంగవీటి ఆరోపించారు. ఆరోపణలపై వాసు అదే స్థాయిలో స్పందించి పార్టీలో కష్టపడ్డ వారికే ప్రాధాన్యం ఇస్తున్నామంటూ వ్యాఖ్యలు చేశారు. అదుపుతప్పే పరిస్థితి నెలకొనటంతో అక్కడే ఉన్న ఎమ్మెల్యే బోడె ప్రసాద్ జోక్యం చేసుకుని ఇరువురికీ సర్దిచెప్పి కార్యక్రమం ముగించుకుని వెళ్లిపోయారు.
జనసేన గళం
టీడీపీ నేతల వ్యవహార తీరుపై జనసేన నేతలూ తమ అసంతృప్తి వెళ్లగక్కారు. జనసేన నేత బొప్పన శివప్రసాద్ తమ పార్టీకి సరైన ప్రాధాన్యం లేదని ఎమ్మెల్యే ఎదుటే టీడీపీ నేతలను నిలదీయటంపై చర్చ జరుగుతోంది. జనసేనకు సముచిత స్థానం కల్పించటం లేదని బొప్పన ఆరోపించటం గమనార్హం.


