ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసానికి దోహదం చేస్తాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు విఽధి నిర్వహణలో ఎదురయ్యే మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు ప్రతిరోజూ కొంత సమయాన్ని ఏదో ఒక క్రీడకు కేటాయించాలని ఆయన సూచించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇగ్నైట్ సెల్‌లో జిల్లా క్రీడల అభివృద్ధి శాఖ ఏర్పాటు చేసిన క్రీడా పరికరాల ప్రదర్శనను కలెక్టర్ తిలకించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన క్యారమ్స్, చదరంగం ఆడారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి శాఖ అధికారి కె.కోటేశ్వరరావు, క్రీడా శిక్షకులు, శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సిబ్బంది అప్రమత్తతతో
తప్పిన పెను ప్రమాదం
నందిగామ టౌన్: ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నందిగామలో బుధవారం చోటుచేసుకుంది. బాధితురాలి కథనం మేరకు చందర్లపాడు మండలం తోటరావులపాడు గ్రామానికి చెందిన కోట శైలజ, భర్త ఆనందరావు, ఇద్దరు కుమార్తెలతో కలిసి గ్రామంలో నివాసముంటున్నారు. పదేళ్లే కిందట గ్రామానికి చెందిన కోట రాజు వద్ద ఇళ్ల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ స్థలంలో ఇల్లు కట్టుకుంటుండగా రెవెన్యూ అధికారులు రెండు రోజుల కిందట ఇల్లు కడుతున్న స్థలంలో సుమారు రెండు సెంట్ల మేర పోరంబోకు స్థలం ఉందని, నిర్మాణం చేయడానికి వీల్లేదంటూ పనులు నిలుపుదల చేశారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా పనులు నిలుపుదల చేయటమేంటని ప్రశ్నించగా ఏదైనా ఉంటే మండల అధికారులతో మాట్లాడుకోవాలని సూచించారు. దీంతో వీరు బుధవారం తహసీల్దార్ సురేష్‌బాబును కలువగా ఆ స్థలం పోరంబోకులో ఉందని, గట్టిగా మాట్లాడితే పట్టా రద్దు చేస్తామని హెచ్చరించారు. అదే సమయంలో ఈ మహిళ కుటుంబం వైఎస్సార్ సీపీ సానుభూతిపరులనే నెపంతో గ్రామ అధికార పార్టీ నేతలు ఇంటి నిర్మాణానికి ఏర్పాటు చేసిన పిల్లర్లను కూలదోశారు. దీంతో మనస్తాపం చెందిన కోట శైలజ రైతుబజార్ సమీపంలో వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన ట్రాఫిక్ పోలీసులు ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకుని ఆమెను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వివరాలు సేకరించిన అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితురాలి వద్ద స్టేట్‌మెంట్ రికార్డు చేశారు.


