రచ్చకెక్కిన తెలుగు తమ్ముళ్ల విభేదాలు | - | Sakshi
Sakshi News home page

రచ్చకెక్కిన తెలుగు తమ్ముళ్ల విభేదాలు

Jul 30 2026 5:24 AM | Updated on Jul 30 2026 5:24 AM

రచ్చకెక్కిన తెలుగు తమ్ముళ్ల విభేదాలు

చందర్లపాడు(నందిగామ టౌన్‌): చందర్లపాడు మండలం తుర్లపాడు గ్రామ టీడీపీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. టీడీపీ జెండా దిమ్మె విషయంలో అర్ధరాత్రి సమయంలో ఇరువర్గాలు పరస్పర దాడులకు పాల్పడటంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే... తుర్లపాడు గ్రామంలో 1984లో తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మెను ఏర్పాటు చేశారు. ఆ దిమ్మె పక్కనే గ్రామానికి చెందిన నందనపాటి పూర్ణయ్య ఏడాది క్రితం అర సెంటు స్థలం కొనుగోలు చేసి రేకుల షెడ్డు నిర్మించి, అందులో కిరాణా దుకాణం నడుపుతున్నాడు. ఈ క్రమంలో టీడీపీ జెండా దిమ్మె దుకాణానికి ఈశాన్యంలో ఉందని గ్రామ టీడీపీ నాయకుడు దాసరి ఏసుప్రభుతో చర్చించి తొలగించేందుకు యత్నించాడు. గ్రామ టీడీపీలోని మరో వర్గానికి చెందిన ఆదిమూలం నరేంద్ర, ఆదిమూలం అప్పారావు అభ్యంతరం చెప్పడంతో ఆ ప్రయత్నం విరమించాడు. పాత దిమ్మెకు పక్కనే దాసరి ఏసుప్రభు వర్గం మరో దిమ్మె నిర్మించి పది రోజుల క్రితం ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో ప్రారం భోత్సవం చేయించింది. అంతేకాకుండా పాత దిమ్మెను తొలగించింది. ఈ విషయం ఆదిమూలం వర్గానికి తెలియటంతో మంగళవారం రాత్రి పాత జెండా దిమ్మె స్థానంలో మరో దిమ్మె నిర్మించేందుకు యత్నించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆదిమూలం వర్గానికి సర్ది చెప్పి ఇంటికి పంపించారు. వారు ఇంటికి వెళ్లగానే ఏసుప్రభు వర్గం ఆదిమూలం వర్గం కట్టించిన దిమ్మెను తొలగించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆదిమూలం వర్గానికి చెందిన 20 మంది బుల్‌డోజర్‌తో వచ్చి ఇటీవల ఎమ్మెల్యే ప్రారంభించిన నూతన జెండా దిమ్మెను తొలగించారు.

ఐదుగురు వ్యక్తులకు

తీవ్ర గాయాలు

జెండా దిమ్మె తొలగించటంపై ఆగ్రహించిన ఇరువర్గాలు పోలీసుల సమక్షంలోనే కర్రలతో ఒకరిపై ఒకరు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన పొల్లా పుల్లారావు, దాసరి చిన్నప్రభు, దాసరి అశోక్‌, ఆదిమూలం నరేంద్ర, ఆదిమూలం అప్పారావులకు తీవ్ర గాయాలయ్యాయి. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటంతో నందిగామ రూరల్‌ సీఐ వై.వి.ఎల్‌.నాయుడు, ఎస్‌ఐ ధర్మరాజు సిబ్బందితో కలిసి ఇరువర్గాలను చెదరగొట్టారు. గ్రామంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్‌ విధించారు. ఇరు వర్గాలకు చెందిన 23 మందిని గుర్తించి కేసు నమోదు చేసేందుకు ఉపక్రమించగా అధికార పార్టీ నేతల వత్తిడితో రాజీ యత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.

తుర్లపాడు టీడీపీలో

ఇరువర్గాల పరస్పర దాడులు

ఐదుగురికి తీవ్ర గాయాలు

టీడీపీ జెండా దిమ్మె విషయంలో ఉద్రిక్తత

రాత్రి వరకు కేసు నమోదు

చేయని పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement