గుణదల(విజయవాడ తూర్పు): మితిమీరిన వేగంతో వెళుతున్న ఓ వాహన చోదకుడి నిర్లక్ష్యానికి ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గుంటూరుజిల్లా మంగళగిరికి చెందిన దాసరి సత్యనాగ కుమారి (63) గృహిణి. వ్యక్తిగత పనుల నిమిత్తం బుధవారం విజయవాడ నగరానికి చేరుకుంది. బందరురోడ్డు పీవీపీ మాల్ వద్ద రోడ్డు దాటుతున్న క్రమంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వైపు వేగంగా వెళుతున్న మట్టా భాను ప్రకాష్ తన ద్విచక్రవాహనంతో ఢీకొట్టాడు. దీంతో రోడ్డుపై పడిపోయిన సత్యనాగ కుమారి తలకు బలమైన గాయమై అపస్మారక స్థితికి చేరుకుంది. స్థానికులు మాచవరం పోలీసులకు సమాచారం అందించారు. వివరాలు సేకరించిన పోలీసులు ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యుల కోరిక మేరకు మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు చేసిన వైద్యులు ఆ వృద్ధురాలు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహన చోదకుడిని అదుపులోకి తీసుకుని బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. సత్యనాగకుమారి మృతితో ఆమె కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.
గాయపడిన వృద్ధుడు మృతి
Jul 30 2026 5:24 AM | Updated on Jul 30 2026 5:24 AM
గాయపడిన వృద్ధుడు మృతి పెనమలూరు: మెట్లు దిగుతూ ప్రమాదవశాత్తు కాలుజారి గాయపడి చికిత్స పొందుతున్న వృద్ధుడు బుధవారం మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకట నారాయణ తెలిపిన వివరాల ప్రకారం నిజాంపట్నం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన చెన్ను ధర్మరాజు (82) జ్వరం రావటంతో విజయవాడలో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందటానికి ఈ నెల 25వ తేదీన వచ్చాడు. వైద్య పరీక్షల అనంతరం యనమలకుదురు భగత్‌సింగ్‌నగర్‌లోని ఆయన కుమార్తె శైలజ ఇంట్లో ఉన్నారు. ఈనెల 26వ తేదీ రాత్రి ఇంటి మెట్లపై నుంచి కిందకు దిగుతున్న సమయంలో కాలు జారి పడిపోవటంతో ధర్మరాజు తలకు తీవ్రగాయాలయ్యాయి. ఆయన్ను విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్చగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం నందిగామ రూరల్: పట్టణం సమీపంలోని అనాసాగరం అండర్ పాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట గ్రామానికి చెందిన యర్రగుంట్ల త్రినేష్ (35) గత కొంతకాలంగా పట్టణంలోని రైతుపేటలో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా అనాసాగరం అండర్ పాస్ వద్దకు వచ్చేసరికి వాహనంపై నుండి కింద పడి మృతి చెందినట్లు తెలిపారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా హుటాహుటిన అక్కడకు వెళ్లి వివరాలు సేకరించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని ప్రమాదం జరిగిందా లేక ప్రమాదవశాత్తు కింద పడ్డాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీను తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు చెప్పారు. వాహన చోదకుడి నిర్లక్ష్యానికి
వృద్ధురాలు బలి
Advertisement


