లారీని ఢీకొన్న వ్యాను : ఒకరు మృతి | - | Sakshi
Sakshi News home page

లారీని ఢీకొన్న వ్యాను : ఒకరు మృతి

Jul 30 2026 5:24 AM | Updated on Jul 30 2026 5:24 AM

లారీని ఢీకొన్న వ్యాను : ఒకరు మృతి

కోనేరుసెంటర్‌: వ్యాను డ్రైవర్‌ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మరో నలుగురిని తీవ్రగాయాలతో ఆసుపత్రిపాలు చేసింది. ఆగి ఉన్న లారీని అతి వేగంగా వెళ్లి ఢీకొనటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. జరిగిన ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. లారీ కింద ఇరుక్కుపోయిన క్షతగాత్రులను అతికష్టం మీద బయటికి లాగి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నం – రేపల్లె హైవేపై బుధవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన బందరు రూరల్‌ ఎస్‌ఐ రమేష్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన తూముగుంటల వెంకటరమణ (61) స్థానికంగా అకౌంటెంట్‌గా పనిచేస్తుంటాడు. అతని భార్య మాధవి మరికొంత మంది మహిళలతో కలిసి హిందూ దేవాలయాల్లో భజనలు చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా వెంకటరమణ దంపతులు మిగిలిన భక్తబృందం (మహిళలు)తో కలిసి వాడపల్లి వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకుని భజన కార్యక్రమం నిర్వహించేందుకు నిర్ణయించుకున్నారు. అందుకోసం మిగిలిన 11 మంది మహిళల బృందంతో కలిసి బుధవారం తెల్లవారుజామున రేపల్లె నుంచి టెంపో వ్యానులో వాడపల్లికి బయలుదేరారు. వ్యాను మచిలీపట్నంలోని కాలేఖాన్‌పేట మీదుగా బైపాస్‌రోడ్డులోకి చేరుకున్న సమయంలో రోడ్డుకు పక్కగా ఆగి ఉన్న లారీని వ్యాను అతివేగంగా వెళ్లి ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యాను లారీ వెనుకభాగం కిందికి దూసుకుపోవటంతో డ్రైవర్‌ పక్క సీటులో కూర్చున్న వెంకటరమణ అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యానులో ఉన్న మరో నలుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన తోటి ప్రయాణికులు బందరు రూరల్‌ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ రమేష్‌ సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకున్నారు. వెంకటరమణ మృతదేహాన్ని బయటికి లాగి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడిన నలుగురు మహిళలను చికిత్స నిమిత్తం మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఓ మహిళకు తీవ్రగాయాలు కావటంతో వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు. మృతుని భార్య మాధవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రమేష్‌ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం వెంకటరమణ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.

మరో నలుగురికి గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement