గుణదల(విజయవాడ తూర్పు): దీర్ఘకాలంగా ఉన్న తమ సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులు కృషి చేయాలని ఏపీ ఎలక్ట్రిసిటీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ అన్నారు. గుణదలలోని విద్యుత్ సౌథ ఆవరణలో గల ఏపీ జెన్‌కో కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో జెన్‌కో మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.నాగలక్ష్మికి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యుత్ శాఖలో ఎంతో కాలంగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. పని అనుభవం, విద్యార్హతలకు అనుగుణంగా గ్రేడ్‌ను మార్చాలని కోరారు. కారుణ్య నియామకాల ద్వారా విధుల్లో చేరిన కార్మికులకు జీఓ నంబరు 129 ప్రకారం వేతనాలు చెల్లించాలని తెలిపారు. జీవిత బీమా, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలను కల్పించాలని కోరారు. ఉన్నతాధికారులతో చర్చించి తగిన పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తామని నాగలక్ష్మి హామీ ఇచ్చినట్టు తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి నారుబోయిన రాము, రీజనల్ కార్యదర్శి సాంబశివారెడ్డి. వి.శాంతకుమార్ తదితరులు పాల్గొన్నారు.


