ఉపకారంలో కోతలు .. విద్యార్థుల వెతలు మచిలీపట్నంఅర్బన్: పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో అమలు చేస్తున్న ఉపకార వేతన పథకాల విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. జిల్లాలోని బీసీ, ఈబీసీ, క్రిస్టియన్, ముస్లిం మైనారిటీ, కాపు, ఎస్టీ విద్యార్థులకు అందాల్సిన మెస్ చార్జీలు, ట్యూషన్ ఫీజు (ఎంటీఎఫ్) బకాయిలు 2023–24వ విద్యా సంవత్సరానికి మూడు క్వార్టర్లు, 2024–25, 2025–26 విద్యా సంవత్సరాలకు పూర్తిగా పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల సమయంలో విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలును పూర్తిగా విస్మరించిందని విద్యార్థి, బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
గత ప్రభుత్వ హయాంలో వార్షిక ఆదాయం రూ.2.50 లక్షలలోపు ఉన్న అర్హులైన బీసీ విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను క్రమం తప్పకుండా విడుదల చేశారు. 2022–23 విద్యా సంవత్సరానికి 14,834 మంది విద్యార్థులకు రూ.13.99 కోట్ల ఎంటీఎఫ్ మంజూరైంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2023–24 విద్యా సంవత్సరానికి మూడు క్వార్టర్ల బకాయిలతో పాటు 2024–25, 2025–26 విద్యా సంవత్సరాలకు సంబంధించిన పూర్తి ఉపకార వేతనాలు ఇప్పటివరకు విడుదల కాలేదు.
ఉపకార వేతనాలు అందక హాస్టల్ ఫీజులు, పుస్తకాలు, రవాణా, పరీక్ష ఫీజులు తదితర విద్యా ఖర్చులను భరించడం పేద కుటుంబాలకు భారంగా మారింది. ఫీజుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడగా, కొందరు విద్యార్థులు చదువులను మధ్యలోనే నిలిపివేయాల్సి వస్తోందని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతన బకాయిలను తక్షణమే విడుదల చేసి పేద విద్యార్థుల ఉన్నత విద్యకు భరోసా కల్పించాలని విద్యార్థి, బీసీ, ముస్లిం మైనారిటీ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
బీసీ విద్యార్థులకు మూడేళ్లుగా అందని స్కాలర్‌షిప్‌లు రూ.40.60 కోట్ల బకాయిలతో విద్యార్థులపై ఆర్థిక భారం అప్పులు చేసి చదువులు కొనసాగిస్తున్న కుటుంబాలు మరికొందరు మధ్యలోనే చదువు నిలిపివేస్తున్న వైనం
వివిధ కేటగిరీల విద్యార్థులకు మొత్తం బకాయిలు
: రూ.40.60 కోట్లు
బీసీ విద్యార్థులకు మొండిచేయి
చదువులపై ఆర్థిక భారం
బీసీ విద్యార్థులకు : రూ.27.68 కోట్లు
ముస్లిం మైనార్టీలకు : రూ.5.32 కోట్లు
క్రిస్టియన్ మైనారిటీ విద్యార్థులకు : రూ.0.76 కోట్లు
ఈబీసీ విద్యార్థులకు : రూ.4.47 కోట్లు
కాపు విద్యార్థులకు : రూ.1.34 కోట్లు
ఎస్టీ విద్యార్థులకు : రూ.0.77 కోట్లు