మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ వినతి 500 మంది రైతుల సంతకాలతో సీఎం చంద్రబాబుకు లేఖ
గన్నవరం: నియోజకవర్గంలోని మెట్ట ప్రాంతంలో నెలకొన్న తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల కారణంగా ఖరీఫ్ పంటలు ఎండిపోయి, రైతుల జీవనోపాధి ప్రమాదంలో పడుతున్న నేపథ్యంలో పోలవరం కాలువ నుంచి విద్యుత్ మోటర్ల ద్వారా సాగునీటి సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని సీఎం చంద్రబాబునాయుడును మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ కోరారు. ఈ మేరకు సీఎంకు నియోజకవర్గానికి చెందిన 500 మంది రైతుల సంతకాలతో కూడిన లేఖను ఆయన రాశారు. నియోజకవర్గంలోని సుమారు 30కు పైగా గ్రామాల ప్రజలు సాగు, తాగునీటి అవసరాల నిమిత్తం పోలవరం కాలువపై ఆధారపడ్డారని చెప్పారు. పోలవరం కాలువ అందుబాటులోకి రాకముందు వర్షపాతం, భూగర్భజలాలపై ఆధారపడిన రైతాంగం తీవ్ర నీటి ఎద్దడిని, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో పోలవరం కుడి కాలువ నిర్మాణం కోసం ఇక్కడి రైతులు నీటి సౌకర్యం కల్పిస్తారనే నమ్మకంతో తమ సారవంతమైన భూములను ప్రభుత్వానికి అప్పగించారని గుర్తుచేశారు. 2015లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడి భౌగోళిక సమస్యను వివరించగా, మెట్ట భూములకు నీటిని లిఫ్ట్ చేయడానికి ప్రభుత్వం అంగీకరించిందన్నారు. దీంతో గత 12 ఏళ్లుగా పోలవరం కాలువ నుంచి మోటర్ల ద్వారా గోదావరి జలాలను తోడుకుని తమ పొలాలకు, చెరువులకు మళ్లించుకుంటున్నారని తెలిపారు. ఈ విధానం జలవనరులు, రెవెన్యూ, విద్యుత్ శాఖల పర్యవేక్షణ, సమ్మతితోనే కొనసాగుతోందన్నారు. ఈ వ్యవస్థపై నమ్మకంతోనే చాలా మంది రైతులు బ్యాంక్ రుణాలు, ప్రైవేట్ అప్పుచేసి మరీ ఈ ఏడాది ఖరీఫ్ సాగును ప్రారంభించారని, అయితే హఠాత్తుగా ఇప్పుడు విద్యుత్ కనెక్షన్లు తొలగించి మోటర్ల ద్వారా నీటి సరఫరా నిలిపివేయడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. కరెంట్ సరఫరాను నిలిపివేసే ముందు రైతులకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వలేదని, కనీసం వారి సమస్యలు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. రైతుల ఆర్థిక పరిస్థితిని, జీవనోపాధిని దెబ్బతీసే ఇలాంటి కఠిన నిర్ణయాన్ని ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించకుండా అమలు చేయడం సరికాదన్నారు. రైతులు పొలం దుక్కులు, నారుమడులు, నాట్లు వేసేందుకు భారీగా ఖర్చుపెట్టారని తెలిపారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి డెల్టా ఆయకట్టు నీటి అవసరాలకు భంగం కలగకుండా మెట్ట ప్రాంత రైతులకు సాగునీటి సరఫరాకు విద్యుత్ కనెక్షన్లను పునరుద్ధరించాలని కోరారు. పోలవరం కాలువ ద్వారా ఎగువ భూములకు నీటిని ఎత్తిపోసేందుకు వీలుగా శాశ్వత విధానాన్ని రూపొందించాలని ఆ లేఖలో సీఎంను కోరారు.


