కోడూరు: కృష్ణా డెల్టాలో వరిసాగు చేసిన వేలాది మంది రైతులు ప్రస్తుతం తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ప్రభుత్వం ఇకనైనా రాజకీయాలను పక్కనబెట్టి అన్నదాతలను ఆదుకునేందుకు సరైన నిర్ణయాలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ అవనిగడ్డ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యుడు సింహాద్రి రమేష్‌బాబు కోరారు. ఆదివారం కోడూరు మండలంలోని ఉల్లిపాలెం ప్రాంతంలో పర్యటించిన రమేష్‌బాబు సాగునీరు అందక బీడువారిన వరి పొలాలను పరిశీలించారు. ప్రస్తుతం పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో 20 పంపులు పని చేస్తున్నాయని, వాటి ద్వారా 700 క్యూసెక్కుల నీటిని కాలువలకు విడుదల చేస్తున్నారని రమేష్‌బాబు తెలిపారు. ఆ నీరు విజయవాడకు చేరుకునే సమయానికి సుమారు 5,500 క్యూసెక్కులుగా మారుతుందని, ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్న మరో 700 క్యూసెక్కులు కలిపి ప్రస్తుతం డెల్డాకు సుమారు 6,200 క్యూసెక్కుల నీరు మాత్రమే అందుతోందని చెప్పారు. అయితే పులిచింతల ప్రాజెక్టులో 29 టీఎంసీల మేర నీటి నిల్వలు ఉన్నాయని, అందులో నుంచి రోజుకు 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినా డెల్టాకు మరో 50 రోజుల పాటు సాగునీరు అందుతుందని రమేష్‌బాబు తెలిపారు. ఇటీవల ప్రభుత్వం ఘనంగా పూజలు నిర్వహించి, కాలువల్లో నీళ్లు వస్తున్నాయని ప్రచారం చేసి రైతులను నారుమడులు పోసుకునేలా ప్రోత్సహించిందని, నేడు అదే రైతులు నీటి కోసం ఎదురుచూస్తుంటే నారుమళ్లు ఎందుకు పోశారని తిరిగి వారే ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. సాగునీరు ఇవ్వలేని పరిస్థితి ఉంటే రైతులు చేసిన ఖర్చుకు పూర్తి నష్ట పరిహారం చెల్లించాలని రమేష్‌బాబు డిమాండ్ చేశారు.
రైతులతో కలిసి పాదయాత్ర చేస్తా..
ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే రైతు సంఘాలు, ప్రజాసంఘాలతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రమేష్‌బాబు హెచ్చరించారు. సాగునీటిపై స్పష్టత ఇవ్వకపోతే విజయవాడ ప్రకాశం బ్యారేజీ వరకు రైతులతో కలిిసి పాదయాత్ర చేస్తానన్నారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తీరుపై రమేష్‌బాబు విమర్శలు గుప్పించారు. కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిజ్‌ల వద్ద ప్రభుత్వం చేపట్టిన నిర్మాణ పనుల నాణ్యతతో జరిగాయని బుద్ధప్రసాద్ ప్రచారం చేస్తున్నారని, అయితే వాస్తవ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందన్నారు. స్లూయిజ్‌కు ఏర్పాటు చేసిన గేట్లు ఉపయోగంలో లేకపోతే రైతులు స్వచ్ఛందంగా రూ.2 లక్షలు సమకూర్చి కాంక్రీట్ పనులు చేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే కవులు, కళాకారులు, జయంతి ఉత్సవాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని, రైతులకు సాగునీరు ఇప్పించడం, వారి సమస్యలను పరిష్కరించడంలో ఏమాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు. పులిగడ్డ అక్విడేట్‌కు రంగులు వేయడం తప్ప నియోజవర్గ రైతాంగానికి చేసిందేమి లేదని ఆరోపించారు. అనంతరం రైతులు బాగు చేసుకున్న స్లూయిజ్‌ను పరిశీలించారు. పార్టీ మండల కన్వీనర్ పరిశె మాధవరావు, నాయకులు కోట పద్మావతి వరప్రసాద్, వెర్రీ శ్రీనివాసరావు, కొక్కిలిగడ్డ శ్రీమన్నారాయణ, కార్యకర్తలు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు


