కృత్తివెన్ను:జిల్లాలోనే సంచలనం కలిగించిన కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెం జంట హత్యల కేసు మిస్టరీ వీడినట్లు తెలుస్తోంది. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు స్థానికుల ప్రమేయంతోనే హత్య జరిగినట్లు సమాచారం. హత్యలో స్థానికులైన ఇద్దరు వ్యక్తులు కీలకపాత్ర పోషించగా మరింత ఎక్కువ మందికి హత్యలో ప్రమేయం ఉండవచ్చే అనుమానాలున్నాయి. ఇప్పటికే పోలీసు యంత్రాంగం దీనిపై ముమ్మర కసరత్తు చేయగా వివరాలు త్వరలో బయటకు రానున్నాయి. హత్యకు గురైన సుబ్బన్న, అయ్యప్పలు చేపల వేటలో దిట్టగా ఉండటంతో పాటు అధికంగా చేపలను వేటాడుతున్నారు. వారితో పోటీ పడలేక వారినే లేకుండా చేసేస్తే తమకు వేటలో పోటీ ఉండదనే అభిప్రాయంతో ఈ హత్యకు రూపకల్పన చేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు.
సుఫారీ గ్యాంగ్ పనేనా ?
హత్యలో స్థానికులతో పాటు గుడివాడకు చెందిన కొందరు కిరాయి హంతకులను ఉపయోగించి హత్య చేయించినట్లు తెలుస్తోంది. దీనికి గాను ముందుగానే పకడ్భందీగా ప్లాన్ వేసుకుని మాట్లాడుకున్నారని ఈ వ్యవహారం అంతా స్థానికంగా ఉన్న ఒక ప్రజాప్రతినిధి కనుసన్నల్లో జరిగినట్లు గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


