గుంటుపల్లి(జి.కొండూరు): మహిళలు నైపుణ్యం పెంచుకొని స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవడం వల్లన ఆర్థికంగా ఎదగొచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. జి.కొండూరు మండలంలోని గుంటుపల్లి రైజ్ కేంద్రంలో హస్తకళా ఉత్పత్తులపై శనివారం నిర్వహించిన వర్క్ షాపును కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రావ్స్ ఎండ్ లెస్ క్రాఫ్టస్ వ్యవస్థాపకురాలు శ్రావణి 60 మంది స్వయం సహాయక సంఘ మహిళలకు బొకేలు, అలంకరణ వస్తువులు, ఆకర్షణీయ బహుమతుల తయారీలో శిక్షణ ఇచ్చారు. డీఆర్‌డీఏ పీడీ ఎ.ఎన్.వి.నాంచారరావు పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): తెలంగాణ నుంచి దుర్గమ్మకు ఆదివారం బంగారు బోనం, ఆషాఢ సారె నేపథ్యంలో అన్ని వీఐపీ, ప్రొటోకాల్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు దుర్గగుడి ఈఓ శీనానాయక్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ బోనం సమర్పణకు సుమారు మూడు వేల మంది కళాకారులు, ఉత్సవ కమిటీ సభ్యులు వస్తారని తెలిపారు. గత ఆదివారం ఒక్క రోజే సుమారు 85 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని పేర్కొన్నారు. ఈ ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉందని భావిస్తున్నామని వివరించారు. మరో వైపున కొండపైకి ఎటువంటి ప్రయివేటు వాహనాలను అనుమతించేది లేదని, దేవస్థానం బస్సులను పూర్తి స్థాయిలో నడుపుతామని తెలిపారు. దివ్యాంగులు, వృద్ధులు, చంటి బిడ్డల తల్లులు ఉదయం ఎని మిది గంటల్లోపు, మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు రావాలని సూచించారు. రద్దీ దృష్ట్యా దేవస్థ్ధానం తీసుకున్న ఈ నిర్ణయంపై భక్తులందరూ సహకరించాలని ఆయన కోరారు.
ఘంటసాల: స్థానిక కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డాక్టర్ డి.సుధారాణి ఉత్తమ శాస్త్రవేత్త పురస్కారానికి ఎంపికయ్యారు. బాపట్లలో జరుగుతున్న వ్యవసాయ విశ్వవిద్యాలయం 58వ వార్షిక స్నాతకోత్సవం సందర్భంగా విశ్వవిద్యాలయం పరి ధిలో ఉత్తమ శాస్త్రవేత్తగా గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా శనివారం ఆమె పురస్కారం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పాలడగు సత్యనారాయణ, న్యూడిల్లీకి చెందిన ఐఏఆర్‌ఐ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు, రిజిస్ట్రార్ డాక్టర్ మణి తదితరులు పాల్గొన్నారు. సుధారాణిని కేవీకే శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ సిబ్బంది, కృష్ణాజిల్లాలోని శాస్త్రవేత్తలు, పలువురు రైతులు, ప్రజా ప్రతినిధులు అభినందనలు తెలిపారు.


