31న ముసాయిదా ఓటర్ల జాబితా | - | Sakshi
Sakshi News home page

31న ముసాయిదా ఓటర్ల జాబితా

Jul 26 2026 7:48 AM | Updated on Jul 26 2026 7:48 AM

31న ముసాయిదా ఓటర్ల జాబితా

అక్టోబర్‌ 3వ తేదీన తుది జాబితా అన్‌ కలక్టబుల్‌ ఓటర్లు 1,37,662 మంది ముగిసిన సర్‌ తొలిదశ కార్యక్రమం వెల్లడించిన కలెక్టర్‌ బాలాజీ

చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం (సర్‌) మొదటిదశ పూర్తయిందని కలెక్టర్‌ డి.కె.బాలాజీ తెలిపారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో శనివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 15,43,242 మంది ఓటర్లు ఉన్నారని వారిలో 14,05,580 మంది నుంచి ఎన్యూమరేషన్‌ ఫారాలు తీసుకున్నామని తెలిపారు. మిగిలిన 1,37,662 ఓటర్ల ఫారాలు తిరిగి సేకరించలేకపోవటంతో వారిని అన్‌కలెక్టబుల్‌గా నమోదు చేశామని పేర్కొన్నారు. వీరిలో 56,346 మంది మరణించగా, 24,603 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని వివరించారు. మరో 34,650 మంది ఇప్పటికే ఇతర చోట్ల నమోదు కావటంతో డూప్లికేట్‌గా గుర్తించామని తెలి పారు. 21,970 మంది ఇంటి వద్ద అందుబాటులో లేని వారుగా, మరో 93 మందికి ఇతర కారణాలు నమోదయ్యాయని వివరించారు. మొత్తం ఓటర్లలో 8.92 శాతం అన్‌కలెక్టబుల్‌గా గుర్తించామన్నారు. ఈ నెల 31వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేస్తామని కలెక్టర్‌ బాలాజీ తెలిపారు.

ఫారం–6 ద్వారా మరో అవకాశం

తుది జాబితాలో పేర్లు లేకపోయినా వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఫారం–6 ద్వారా తిరిగి ఓటర్లుగా చేరే అవకాశం ఉందని కలెక్టర్‌ బాలాజీ సూచించారు. ముసాయిదా ప్రచురణ అనంతరం ఆగస్టు 30వ తేదీ వరకు క్లయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపారు.

అనంతరం సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసి వారి వాదనలు, సమర్పించిన పత్రాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అన్ని ప్రక్రియలు పూర్తి చేసిన అనంతరం అక్టోబరు మూడో తేదీన తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తామని కలెక్టర్‌ తెలిపారు. 14,05,580 మంది ఎన్యూమరేషన్‌ ఫారాల్లో 13,82,660 మంది ఓటర్ల వివరాలు 2002 ఓటర్ల జాబితాలో ఉన్న వారి పేర్లు, తల్లిదండ్రులు లేక వారి కుటుంబ సభ్యుల పేరుతో మ్యాపింగ్‌ చేసినట్లు తెలిపారు. నో మ్యాపింగ్‌ కింద గుర్తించిన వారికి మాత్రమే నోటీసులు జారీ చేస్తామని, వారికి అవసరమైన పత్రాల జాబితాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధించిన ధ్రువపత్రాలు జతపరిస్తే పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో ప్రతి ఓటరుకు పూర్తి సహకారం అందించేలా బీఎల్‌వోలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రజలకు అవసరమైన వివరాలు తెలిపి ఇబ్బందులు కలగకుండా అవసరమైన పత్రాలు సేకరించే చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్‌ వివరించారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జ్‌ డీఆర్వో ఎస్‌.పోతురాజు, కలెక్టరేట్‌ ఏఓ ఎ.ఎస్‌.ఎన్‌.రాధిక, ఎన్నికల విభాగం డెప్యూటీ తహసీల్దార్లు ఎం.వి.శ్యామ్‌నాథ్‌, వై.నారాయణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement