పెనుగంచిప్రోలు: ఆషాఢమాసం సందర్భంగా పెనుగంచిప్రోలు గ్రామంలో కొలువైన శ్రీ తిరుపతమ్మ తల్లికి గురువారం గ్రామంలోని భక్త సేవా సేవాసంఘం ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో మహిళలు సారె సమర్పించి బోనాలు చెల్లించారు. అమ్మవారి రంగుల మండపం నుంచి మేళ తాళాలతో ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకోగా వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య అమ్మవారికి సారె సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ జంగం శ్రీనివాసరావు, సూపరింటెండెంట్లు రాజు, లక్ష్మణ్, కార్యక్రమ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా డీఎంహెచ్‌ఓ
డాక్టర్ శ్రావణ్‌బాబు
లబ్బీపేట(విజయవాడతూర్పు): జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాల అమలులో ప్రగతి సాధించాలని ఎన్టీఆర్ జిల్లా డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎ.శ్రావణ్‌బాబు అన్నారు. ఆయన జిల్లా పరిధిలోని పీహెచ్‌సీ వైద్యాధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆరోగ్య కార్యక్రమాలను అంశాల వారీగా చర్చించి, అభివృద్ధి సూచికలో ముందుండాలన్నారు. అందుకు అనుగుణంగా అన్ని కార్యక్ర మాలను సమర్థంగా నిర్వహించి జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని సూచించారు. ఈ సమీక్షలో డెప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఇందుమతీదేవి, డీఐఈ డాక్టర్ శరత్‌బాబు, డీపీఎంఓ డాక్టర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.
కృష్ణలంక(విజయవాడతూర్పు): నగరంలోని కృష్ణలంక, భ్రమరాంబపురంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కృష్ణలంక–7ను గురువారం ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏ.శ్రావణ్‌బాబు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రం పరిసరాలు, పరిశుభ్రత, త్రాగునీటి సౌకర్యం, మూత్రశాలలు, వాటిలో నీటి సదుపాయం పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. పరిశుభ్రతపైన, కనీస వసతులపైన ప్రత్యేక దృష్టి పెట్టి అమలయ్యేలా చూడాలని ఆదేశించారు. అనంతరం లాబొరేటరీలో పరీక్ష వివరాలను పరిశీలించి రిపోర్ట్‌లను తనిఖీ చేశారు. వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. వైద్యం కోసం వచ్చిన రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి మందులను పరిశీలించారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాలపై దాడుల విషయంలో నమోదవుతున్న కేసుల విచారణను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. ఈ కేసుల్లో ఎఫ్‌ఐఆర్, చార్జ్‌షీట్ దాఖలులో ఎటువంటి జాప్యం లేకుండా చూడాలన్నారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో గురువారం జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. తొలుత గత సమీక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై సమగ్రంగా సమీక్షించారు. సమావేశంలో కమిటీ సభ్యులు కె.కొండలరావు, టి.సాయిబాబా, ఎ.శ్రీదేవిలు ఎస్సీ, ఎస్టీలకు చేపడుతున్న కార్యక్రమాలు, విద్యార్థుల సంక్షేమం వంటి అంశాలను ప్రస్తావించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 78 ప్రభుత్వ వసతి గృహాల్లో ఏవైనా లోపాలు గుర్తిస్తే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. అధికారులు ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన కేసుల పురోగతిని వివరించారు. 2026 మార్చి 31 నాటికి 122 ట్రయల్ కేసులు పెండింగ్‌లో ఉండగా, అనంతరం జూన్ 20 వరకు మరో 18 కేసులు నమోదయ్యాయని తెలిపారు. వీటిలో ఒక కేసులో నిందితుడు దోషిగా తేలగా, రెండు కేసుల్లో నిర్దోషులుగా తీర్పు వెలువడిందన్నారు. మరో 35 కేసుల్లో సాక్షుల విచారణ పూర్తికాగా, ఐదు కేసులు ప్రస్తుతం ట్రయల్ దశలో ఉన్నాయని వివరించారు. అనంతరం మాన్యువల్ స్కావెంజింగ్ నిర్మూలనపై సమీక్షిస్తూ, జిల్లాలో ప్రస్తుతం మాన్యువల్ స్కావెంజర్లు లేరని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, సీసీఆర్‌బీ ఏసీపీ కె.వెంకటేశ్వరరావు, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు మాన్యువల్ స్కావెంజర్స్ కమిటీ సభ్యులు ఆనంద కీర్తి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి పి.జ్యోతిలక్ష్మిదేవి, విజయవాడ ఆర్డీవో వెన్నెల శ్రీను, ఏసీపీలు సి.హెచ్. శ్రీనివాసరావు, పి.రామమోహన్‌రావు, ఉమామహేష్ తదితరులు పాల్గొన్నారు.


