కోనేరుసెంటర్: మానవహక్కుల సంఘం జాతీయ మహిళా అధ్యక్షురాలిగా చెప్పుకునే మచిలీపట్నంకు చెందిన అమ్మిరెడ్డి రజనిపై చిలకలపూడి పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. సీఐ ఎస్‌కే నభీ తెలిపిన వివరాల ప్రకారం... కృష్ణాజిల్లా చల్లపల్లి మండలానికి చెందిన షేక్‌రిమ్షి భర్తతో మనస్పర్ధల కారణంగా గత యేడాది విడాకులు తీసుకుంది. అనంతరం మచిలీపట్నంకు చెందిన అమీన్ అనే వ్యక్తిని ఈ యేడాది జనవరి 15న రెండో వివాహం చేసుకుంది. కొన్ని రోజుల తర్వాత వీరిరువురి మధ్య కూడా దూరం పెరిగింది. అమీన్ వేఽధింపులు భరించలేని రిమ్షి ఇటీవల ఇనగుదురుపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేస్తున్న సమయంలో రిమ్షి సమీప బంధువు పోలీసుల వద్ద కంటే అమ్మిరెడ్డి రజని వద్దకు వెళితే న్యాయం జరుగుతుందని చెప్పడంతో ఆమె ఇటీవల మానవహక్కుల సంఘం (ప్రైవేటు సంస్థ) జాతీయ అధ్యక్షురాలు అమ్మిరెడ్డి రజని వద్దకు వెళ్ళి సమస్య వివరించింది. దీంతో కౌన్సెలింగ్ పేరుతో అమీన్‌ను తన కార్యాలయానికి పిలిచిన రజని అమీన్ ఉత్తముడు అంటూ సర్టిఫికెట్ ఇవ్వటంతో పాటు తప్పు మొత్తం నీదేనంటూ రిమ్షిపై నిందలు మోపింది. రిమ్షి మొబైల్‌ను బలవంతంగా లాక్కుని తన సొరుగులో పెట్టుకుంది. ఆమెను భయబ్రాంతులకు గురి చేసి రూ. 40,000 తన ఖాతాలోకి ఫోన్‌పే ద్వారా వేయించుకుంది. ఐదు గ్రాముల బంగారాన్ని బలవంతంగా తీసుకుంది. చివరికి తప్పంతా నీదేనంటూ బెదిరించి పంపేసింది. దిక్కుతోచని రిమ్షి మరలా పోలీసులను ఆశ్రయించింది. తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌లో రజినిపై ఫిర్యాదు చేసింది. బాఽధితురాలికి జరిగిన అన్యాయాన్ని తెలుసుకుని రజని కార్యకలాపాలపై పూర్తి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ జిల్లా ఎస్పీ సిబ్బందిని ఆదేశించారు. విచారణలో బాధితురాలి ఫిర్యాదు వాస్తవమేనని తెలుసుకున్న సీఐ నభీ విషయాన్ని ఉన్నతాధికారుల నోటీసులో పెట్టి రజనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. గురువారం ఆమెను కోర్టులో హాజరు పరచగా న్యాయస్థానం ఆమెకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు సీఐ తెలిపారు.


