మొగల్రాజపురం(విజయవాడ తూర్పు):
గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం కాజ గ్రామంలోని పొలాల్లో బయల్పపడిన 4వ శతాబ్దానికి చెందిన రెండు చిన్న వినాయక విగ్రహాల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతి సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడ మొగల్రాజపురంలోని కల్చరల్ సెంటర్‌లో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. కాజ గ్రామానికి చెందిన సింహాద్రి వెంకటరామారెడ్డి తన పొలాన్ని దున్నతుండగా రెండు చిన్న విగ్రహాలు లభించాయని తనకు సమాచారం ఇవ్వడంతో గురువారం వాటిని పరిశీలించానని చెప్పారు. మూడు నుంచి 5 సెంటీమీటర్ల పరిమాణం గల ఎర్ర ఇసుక రాతి (చింతామణి రాయి)తో చేసి రెండు విగ్రహాలతో పాటు ఎరుపు, నలుపు, గచ్చకాయ, గోధుమ రంగు మట్టి పాత్రల పెంకులు కూడా లభించాయని తెలిపారు. అవి 4వ శతాబ్దం (శాతవాహన, ఆనందగోత్రినుల కాలం) నాటివని శివనాగిరెడ్డి చెప్పారు. ఎంతో చారిత్రక ప్రాధాన్యత గల ఈ విగ్రహాలను పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శివనాగిరెడ్డి కోరారు.
పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి


