తిరుపతమ్మకు సారె సమర్పణ | - | Sakshi
Sakshi News home page

తిరుపతమ్మకు సారె సమర్పణ

Jul 23 2026 2:06 AM | Updated on Jul 23 2026 2:06 AM

పెనుగంచిప్రోలు: ఆషాఢ మాసం సందర్భంగా గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ తిరుపతమ్మ వారికి బుధవారం అమ్మవారి సేవకురాలు పాపమాంబ వంశీకులైన ఆలయ అర్చకులు సారె సమర్పించి బోనాలు చెల్లించారు. గ్రామంలోని అమ్మవారి రంగుల మండపం నుంచి ఆలయం వరకు మేళతాళాలతో వారు చేరుకున్నారు. అమ్మవారికి సారె సమర్పణ అనంతరం వారికి వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు.

పారా స్పోర్ట్స్‌ మీట్‌లో దివ్యాంగ విద్యార్థి ప్రతిభ

కంకిపాడు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమగ్రశిక్ష, పీఎం శ్రీ, రాష్ట్ర సహిత విద్యా విభాగం సంయుక్తంగా ఆగిరిపల్లి మండలం తోటపల్లి హీల్‌ ప్యారడైజ్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పారా స్పోర్ట్స్‌ మీట్‌లో కంకిపాడుకు చెందిన ప్రత్యేక విద్యార్థి ప్రతిభ చాటారు. ఈనెల 20 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించిన పోటీల్లో జిల్లా జట్టుకు ప్రాతినిథ్యం వహించిన కంకిపాడుకు చెందిన దివ్యాంగ విద్యార్థి వినుకొండ భరత్‌బాబు షాట్‌పుట్‌ జూనియర్స్‌ విభాగంలో ద్వితీయ స్థానం, 400 మీటర్ల పరుగు పందెంలో తృతీయ స్థానం, లాంగ్‌జంప్‌లో ద్వితీయ స్థానాన్ని కై వసం చేసుకున్నాడు. ప్రతిభ చూపిన విద్యార్థిని శాప్‌ ఎండీ ఎస్‌.భరణి, సమగ్ర శిక్ష ఏఎస్‌పీడీ కె.రవీంద్రనాఽథ్‌రెడ్డి, ఏపీ పారా స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ సెక్రటరీ వి.రామస్వామి, ఐఈ రీసోర్సు టీచర్లు అభినందించారు.

కారు ఢీకొని

వృద్ధురాలు దుర్మరణం

కంకిపాడు: కారు ఢీకొని వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై బుధవారం చోటుచేసుకుంది. కంకిపాడు ఎస్‌ఐ కేవై దాసు తెలిపిన వివరాల ప్రకారం.. పమిడిముక్కల మండలం అమీనాపురం గ్రామానికి చెందిన కోలాహలం సూర్యకుమారి (68) ప్రొద్దుటూరు శివారు కొణతనపాడు గ్రామంలోని తమ్ముడిని చూసేందుకు అమీనాపురం నుంచి కొణతనపాడు గ్రామానికి వచ్చింది. కొణతనపాడు అడ్డరోడ్డు వద్ద రోడ్డు దాటే ప్రయత్నంలో మచిలీపట్నం నుంచి విజయవాడకు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొంది. తీవ్రంగా గాయపడిన సూర్యకుమారిని వైద్యం నిమిత్తం విజయవాడకు తరలిస్తుండగా మృతి చెందింది. మృతురాలి కుమార్తె పోరంకి దేవి నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

కుమారుడి హత్య కేసులో తల్లికి రిమాండ్‌

చల్లపల్లి: కుమారుడి హత్య కేసులో నిందితురాలైన తల్లికి కోర్టు రిమాండ్‌ విధించింది. ఎస్‌ఐ డి.దుర్గాంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. చల్లపల్లి పడమర వీధికి చెందిన దుర్గాప్రసాద్‌ ఈనెల 20న రాత్రి మద్యం సేవించి తన తల్లి నాగమణితో వాగ్వివాదానికి దిగాడు. ఈ నేపథ్యంలో సహనం కోల్పోయిన ఆమె ఇనుప రాడ్డుతో కొట్టడంతో దుర్గాప్రసాద్‌ మృతిచెందాడు. ఈ కేసులో నిందితురాలైన తల్లి నాగమణిని మొవ్వ కోర్టులో హాజరు పరచగా కోర్టు ఆమెకు 14 రోజులు రిమాండు విధించింది.

బందరు కాలువలో

గుర్తు తెలియని మృతదేహం

పెనమలూరు: బందరు కాలువలో పెనమలూరు వంతెన వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. ఎస్‌ఐ తాతాచారి తెలిపిన వివరాల ప్రకారం.. బందరు కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం మంగళవారం రాత్రి కొట్టుకు వచ్చింది. మృతుని వయస్సు సుమారు 35 నుంచి 40 సంవత్సరాలు ఉంటుంది. వంటిపై నల్లరంగు ప్యాంట్‌, పసుపు రంగు చొక్కా ధరించి ఉన్నాడు. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా ఉబ్బిపోయింది. పోలీసులు బుధవారం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆచూకీ తెలిసిన వారు సెల్‌: 96183 36684 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

కృష్ణారావు మృతదేహం లభ్యం

ఇబ్రహీంపట్నం(జి.కొండూరు): కొండపల్లి శాంతినగర్‌ వద్ద బుడమేరు డైవర్షన కెనాల్‌లో ఈనెల 19న ఈతకు దిగి గల్లంతైన బైనిబిల్లి కృష్ణారావు(50) మృతదేహం బుధవారం సాయంత్రం వీటీపీఎస్‌ సమీపంలో కెనాల్లో లభ్యమైంది. మృతుడు కృష్ణారావుకి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కృష్ణారావు మృతదేహం మూడు రోజులుగా నీటిలో నానడంతో ఉబ్బిపోయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement