కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశం
చిలకలపూడి(మచిలీపట్నం): పట్టణాల్లో బల్క్ వేస్ట్ జనరేటర్లను గుర్తించి వ్యర్థాలను మూలంలోనే శాసీ్త్రయంగా నిర్వహించేలా చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ, కాలుష్య నియంత్రణ మండలి తదితర శాఖల అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఘన వ్యర్థాల నిర్వహణ, బల్క్ వేస్ట్ జనరేటర్ల గుర్తింపు, కంపోస్టింగ్ విధానాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై విస్తతంగా సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ రోజుకు 100 కిలోలకుపైగా తడి వ్యర్థాలు ఉత్పత్తి చేసే సంస్థలు, 20 వేల చదరపు అడుగులకు పైబడిన భవనాలు, రోజుకు 40 వేల లీటర్లకు పైగా నీటిని వినియోగించే సంస్థలు బల్క్ వేస్ట్ జనరేటర్లుగా పరిగణించబడతాయన్నారు. ఫంక్షన్ హాళ్లు, హోటళ్లు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, అపార్ట్‌మెంట్లు, షాపింగ్ కాంప్లెక్సులు, పరిశ్రమలు తదితర సంస్థలను తప్పనిసరిగా గుర్తించి నిబంధనల పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. ఈ నెలాఖరులోగా అన్ని మున్సిపాలిటీల్లో బల్క్ వేస్ట్ జనరేటర్ల సమగ్ర జాబితాను సిద్ధం చేయాలని కమిషనర్లను ఆదేశించారు.
వేర్వేరుగా సేకరించాలి..
బల్క్ వేస్ట్ జనరేటర్లు తడి, పొడి, ప్రమాదకర, శానిటరీ వ్యర్థాలను మూలంలోనే వేర్వేరుగా సేకరించాలని, తడి చెత్తను కంపోస్టింగ్ లేదా బయోగ్యాస్ ద్వారా శుద్ధి చేయాలని, ప్లాస్టిక్, కాగితం, లోహం వంటి పొడి వ్యర్థాలను రీసైక్లింగ్‌కు పంపించాలని కలెక్టర్ సూచించారు. తడి చెత్తను సేంద్రీయ ఎరువుగా మార్చేందుకు ఆధునిక కంపోస్టింగ్ పద్ధతులు, డబుల్ కంపోస్టింగ్ బిన్స్, బయోగ్యాస్ యూనిట్లు, కంపోస్ట్ పిట్స్ వినియోగాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలని సూచించారు. గ్రీన్ రిచ్ సంస్థ రూపొందించిన డబుల్ కంపోస్టింగ్ బిన్స్ ద్వారా ఒక బిన్ నిండిన తర్వాత మరో బిన్‌ను వినియోగిస్తే సుమారు 30 రోజుల్లో సేంద్రియ ఎరువు సిద్ధమవుతుందని, రోజుకు 5 కిలోల నుంచి ఒక టన్ను వరకు తడి వ్యర్థాలను శాసీ్త్రయంగా ప్రాసెస్ చేసే పరికరాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. మచిలీపట్నం, గుడివాడ, పెడన, ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్లు బాపిరాజు, మనోహర్‌రావు, కొండయ్య, సుభాష్ చంద్రబోస్, జిల్లా పంచాయతీ అధికారి ఎం. ధనలక్ష్మి, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ శ్రీనివాస్, గ్రీన్ రిచ్ సంస్థ డైరెక్టర్ ఎస్. శరవణ రాజ్ తదితరులు పాల్గొన్నారు.


