నాణ్యమైన విద్యుత్‌ సరఫరా లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విద్యుత్‌ సరఫరా లక్ష్యం

Jul 23 2026 2:06 AM | Updated on Jul 23 2026 2:06 AM

పెనమలూరు: నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్‌, ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. హడ్కో నిధులు రూ. 4.20 కోట్లతో యనమలకుదురులో 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే పెదపులిపాకలో రూ. 4.20 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రోజుకు 200 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం జరుగుతోందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని డిస్కంలను పటిష్టం చేస్తున్నామని, రూ. 200 కోట్లతో నూతన సబ్‌స్టేసన్ల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. గ్రామాలలో 24 గంటల నిరంతరం విద్యుత్‌ సరఫరా, రైతులకు ఏకకాలంగా 9 గంటల విద్యుత్‌ ఇస్తున్నామన్నారు. యనమలకుదురు, పెదపులిపాక గ్రామాలలో భవిష్యత్‌లో పూర్తి స్థాయిలో నాణ్యమైన విద్యుత్‌ అందుతుందని చెప్పారు.

సోలార్‌ విద్యుత్‌కు ప్రోత్సాహం..

సూర్యఘర్‌ పథకం కింద ప్రతి ఇంటిపై సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం తమ వంతు కృషి చేస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు. దేశం మొత్తం మీద కోటి సోలార్‌ కనెక్షన్లు లక్ష్యం కాగా రాష్ట్రంలో 6 లక్షల కనెక్షన్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఎస్సీలకు ఈ పథకం అమలు చేస్తున్నామని, త్వరలో బీసీలకు కూడా పథకం అమలు చేస్తామన్నారు.

తొలుత మంత్రి శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌, ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ పుల్లారెడ్డి, డైరెక్టర్‌ టెక్నికల్‌ మురళీకృష్ణ యాదవ్‌, డైరెక్టర్‌ ప్రాజెక్ట్స్‌ టీవీఎన్‌ఎస్‌ మూర్తి, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మంత్రి గొట్టిపాటి రవికుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement