● అలంకారాలు, క్యూలైన్లు, ● ఇంజినీరింగ్ పనులకు అంచనాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై వైభవంగా నిర్వహించే దసరా ఉత్సవాల తొలి సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. మహామండపం నాలుగో అంతస్తులోని ఈఓ ఛాంబర్‌లో ఈఓ శీనానాయక్ అధ్యక్షతన ఆలయ ఏఈఓలు, సూపరింటెండెంట్లు, ఇంజినీరింగ్ అధికారులు ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. దసరా ఉత్సవాలకు సంబంధించి అమ్మవారి విశేష అలంకారాలను త్వరగా సిద్ధం చేయాలని వైదిక కమిటీని, అదే విధంగా క్యూలైన్లు, ఇతర ఇంజినీరింగ్ పనులకు సంబంధించిన అంచనాలను సిద్ధం చేయాలని ఆలయ ఈఓ శీనానాయక్ ఆలయ అధికారులను ఆదేశించారు. రానున్న దసరా ఉత్సవాలకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారని, అందుకు తగిన రీతిలో భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, మౌలిక వసతులపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ఆయా విభాగాల అధికారులు తమకు కేటాయించిన పనులపై సమగ్రంగా అంచనాలను రూపొందించడంతో పాటు అంచనా వ్యయం వెంటనే సిద్ధం చేయాలన్నారు. దసరా ఉత్సవాల ప్రతిపాదనలను రానున్న ట్రస్ట్ బోర్డు సమావేశం నాటికి సిద్ధం చేయడంతో పాటు పాలకవర్గ ఆమోదం కోసం పంపాలన్నారు. ప్రభుత్వం నుంచి, దేవదాయ శాఖ నుంచి అనుమతి పొందాల్సిన అంశాల జాబితాను సిద్ధం చేయడంతో పాటు ప్రత్యేక నివేదికను తయారు చేయాలన్నారు. అన్ని విభాగాల సహకారంతో దసరా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ఏఈఓ ఎన్. రమేష్‌బాబు, చంద్రశేఖర్, తిరుమలేశ్వరరావు, ఈఈ ఎల్.రమాదేవి, ఏఈఈలు, వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


