పల్లె నుంచి పరిశోధనల శిఖరానికి.. | - | Sakshi
Sakshi News home page

పల్లె నుంచి పరిశోధనల శిఖరానికి..

Jul 21 2026 2:00 AM | Updated on Jul 21 2026 2:00 AM

పల్లె నుంచి పరిశోధనల శిఖరానికి..

స్ఫూర్తిదాయకంగా యువ శాస్త్రవేత్త తక్కెళ్ల దినేష్‌బాబు ప్రభుత్వ బడి నుంచి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఐఐటీ హైదరాబాద్‌ నుంచి పీహెచ్‌డీ ప్రదానం అంతర్జాతీయ జర్నల్స్‌లో 24 పరిశోధనా వ్యాసాలు ప్రచురితం

ప్రభుత్వ విద్యాసంస్థలోనే బలమైన పునాది

కోడూరు: అతనిది సముద్రతీరంలో ఓ చిన్న గ్రామం. సాధారణ కుటుంబం. ప్రభుత్వ పాఠశాలలోనే చదువు. కల మాత్రం ప్రపంచాన్ని తాకేంతటిది. ఆ కలను కేవలం ఊహగా మిగల్చకుండా కఠోర శ్రమతో నిజం చేసి చూపించారు కోడూరు మండలం వి.కొత్తపాలెం గ్రామానికి చెందిన యువ శాస్త్రవేత్త డాక్టర్‌ తక్కెళ్ల దినేష్‌బాబు. ప్రభుత్వ విద్యసంస్థల్లోనే చదువుకుని జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతున్నారు. ఐఐటీ హైదరాబాద్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసి, నేడు అమెరికాలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఆఫ్‌ కాన్సాస్‌లో పోస్టు డాక్టోరల్‌ రీసెర్చర్‌గా ఎంపిక కావడం ఆయన పట్టుదలకు నిదర్శనం.

పరిశోధనతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూ..

కెమిస్ట్రీపై అపారమైన ఆసక్తితో ముందుకు సాగిన దినేష్‌బాబు, ఐఐటీ హైదరాబాద్‌లో డీఎన్‌ఏ నిర్మాణం, దాని చలన స్వభావం, ఎపిజెనెటిక్‌ మార్పులపై అత్యాధునిక స్పెక్ట్రోస్కోపిక్‌, మైక్రోస్కోపిక్‌, కంప్యూటేషనల్‌ పద్ధతులతో విస్తృత పరిశోధనలు చేశారు. ఆయన సమర్పించిన పీహెచ్‌డీ పరిశోధన శాసీ్త్రయ వర్గాల ప్రశంసలు అందుకుంది. పరిశోధనలో కనబర్చిన ప్రతిభకు గుర్తింపుగా ఐఐటీ హైదరాబాద్‌ ప్రతిష్టాత్మక రీసెర్చ్‌ ఎక్సలెన్స్‌ అవార్డుతో దినేష్‌బాబును సత్కరించింది. ఇదే కాకుండా అంతర్జాతీయ శాసీ్త్రయ జర్నల్స్‌లో ఏకంగా 24 పరిశోధనా వ్యాసాలు ప్రచురించడం విశేషం. వాటిలో 14 పరిశోధనలకు తొలి రచయితగా, మరో పరిశోధనకు సంబంధిత రచయితగా వ్యవహరించడం దినేష్‌బాబు ప్రతిభకు అద్దం పడుతోంది.

అమెరికాలో ప్రతిష్టాత్మక బాధ్యత

ప్రపంచ స్థాయి పరిశోధనల దిశగా మరో అడుగు వేస్తూ, డాక్టర్‌ దినేష్‌బాబు ప్రస్తుతం అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాన్సాస్‌లో పోస్టు డాక్టోరల్‌ రీసెర్చర్‌గా బాధ్యతలు చేపట్టారు. రీసెర్చర్‌గా చేస్తున్నందుకు సంవత్సరానికి సుమారు రూ.60 లక్షల వేతన ప్యాకేజీ లభిస్తోంది. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన ఒక యువకుడు ప్రపంచ స్థాయి పరిశోధనల్లో భాగస్వామి కావడం గర్వకారణంగా ఉందని కుటుంబ సభ్యులు, వి.కొత్తపాలెం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆత్మవిశ్వాసం ముఖ్యం

ప్రస్తుతం అమెరికాలో ఉన్న దినేష్‌బాబు ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. పాఠశాల ఏదన్నది ముఖ్యం కాదు. మన పట్టుదలే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఇతరులతో పోల్చుకోవడం మానేసి జ్ఞానాన్ని పెంచుకోవడంపైనే దృష్టి పెట్టాలి. కష్టపడే తత్వం, క్రమశిక్షణ, దృఢ సంకల్పం ఉంటే ప్రపంచంలో ఏ లక్ష్యాన్ని అయినా చేరుకోవచ్చు’ అని దినేష్‌బాబు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతంలో జన్మించిన తాను అమెరికాలోని యూని వర్సిటీ ఆఫ్‌ కాన్సాస్‌లో పోస్ట్‌ డాక్టోరల్‌ రీసర్చర్‌గా రూ.60 లక్షల వార్షిక వేతనం తీసుకోవడం గర్వంగా ఉందని, పరిశోధన రంగంలో మరిన్ని ఆవిష్కరణలు చేయాలనే లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నానని వివరించారు. తన విజయానికి తల్లిదండ్రులు, గురువులు, పరిశోధనా మార్గదర్శకుల ప్రోత్సాహమే ప్రధాన బలమని చెప్పారు.

దినేష్‌బాబు వి.కొత్తపాలెం గ్రామానికి చెందిన తక్కెళ్ల శ్రీనివాసరావు, సుజాత దంపతులకు జన్మించారు. ఆయన విద్యాభ్యాసం మొత్తం ప్రభుత్వం విద్యాసంస్థల్లోనే సాగింది. వి.కొత్తపాలెం జెడ్పీ పాఠశాలలో పదో తరగతి వరకు, అవనిగడ్డ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాల బీఎస్సీ పూర్తి చేశారు. విద్యార్థి దశలోనే ఎన్‌సీసీలో చురుకుగా పాల్గొని ‘బీ’, ‘సీ’ సర్టిఫి కెట్లను సాధించి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకున్నారు. ఆ తర్వాత ఆంధ్ర విశ్వ విద్యాలయంలో ఎంఎస్సీ ఫిజికల్‌ కెమిస్ట్రీలో ప్రవేశం పొంది, విశ్వవిద్యాలయంలోనే ప్రథమ స్థానం సాధించారు. బంగారు పతకంతో పాటు యూనివర్సటీ ర్యాంక్‌ హోల్టర్‌ అవార్డు, యూజీసీ అవార్డులను అందుకున్నారు. అనంతరం సీఎస్‌ఐఆర్‌– యూజీసీ జేఆర్‌ఎఫ్‌ అండ్‌ నెట్‌, గేట్‌, ఏపీసెట్‌ వంటి జాతీయస్థాయి పరీక్షల్లో అర్హత సాధించి పరిశోధన రంగంలో తన సత్తాచాటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement