పీఎంఎఫ్‌బీవైను సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పీఎంఎఫ్‌బీవైను సద్వినియోగం చేసుకోవాలి

Jul 21 2026 2:00 AM | Updated on Jul 21 2026 2:00 AM

పీఎంఎఫ్‌బీవైను సద్వినియోగం చేసుకోవాలి

మచిలీపట్నంఅర్బన్‌: ఈ ఖరీఫ్‌ సీజన్‌కు ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) కింద అర్హులైన రైతులందరూ తప్పనిసరిగా నమోదు చేసుకుని పంటల బీమా రక్షణ పొందా లని కృష్ణా జిల్లా కలెక్టర్‌ డి.కె.బాలాజీ సూచించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశం సోమ వారం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకురాలు జ్యోతి రమణి పథకం లక్ష్యాలు, అమలు మార్గదర్శకాలు, ఖరీఫ్‌–2026 అమలు విధానాన్ని వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ బాలాజీ మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులకు కలిగే పంట నష్టాలను తగ్గించి వారికి ఆర్థిక భద్రత కల్పించడమే ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన ప్రధాన లక్ష్యమని తెలిపారు. రుణగ్రహీత రైతులతో పాటు రుణేతర రైతులు, కౌలు రైతులు కూడా స్వచ్ఛందంగా పథకంలో నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. గ్రామస్థాయిలో రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించి అర్హులైన ప్రతి రైతు పథకంలో నమోదు అయ్యేలా వ్యవసాయ, రెవెన్యూ, గ్రామ సచివాలయ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ ఏడాది రుణేతర రైతులకు రైతు స్వీయ ధ్రువీకరణ విధానాన్ని ప్రవేశపెట్టడంతో నమోదు ప్రక్రియ మరింత సులభతరమైందని కలెక్టర్‌ పేర్కొన్నారు. జిల్లాలో రైతుల నమోదు పురోగతిని సమీక్షించిన కలెక్టర్‌, లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని నమోదు కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన ప్రచార పోస్టర్‌ను కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్‌ ఎస్‌ఈ గుణకర్‌, జిల్లా ఉద్యాన శాఖ అధికారి జె.జ్యోతి, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ రవీంద్రారెడ్డి, జిల్లా గణాంక శాఖ ఏడీ కె.పద్మజ, డ్రెయినేజీ ఈఈ కిరణ్‌బాబు, కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్త సుధారాణి, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, టాటా ఏఐజీ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ప్రతినిధులు, మండల వ్యవసాయ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

కృష్ణా జిల్లా కలెక్టర్‌ బాలాజీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement