లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా వైద్యశాఖ ఉద్యోగి కూనపరెడ్డి శ్రీనివాసరావు నియమితులయ్యారు. విజయవాడలో ఆదివారం జరిగిన సంఘ సమావేశంలో శ్రీనివాసరావును కార్యదర్శిగా నియమిస్తూ సంఘ అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణ నియామక ఉత్తర్వులు అందజేశారు. శ్రీనివాసరావుకు సంఘ సభ్యులు అభినందనలు తెలిపారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకునేందుకు నేడు (20వ తేదీ) సోమవారం రాత్రి 11.59 గంటలకు గడువు ముగుస్తుందని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్)సీఎండీ పి.పుల్లారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగి ఇంకా దరఖాస్తు చేయని అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా, ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించి, అవసరమైన పత్రాలను జతచేసి నిర్ణీత గడువులోపు దరఖాస్తు పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ దళారులు చెప్పే మాటలను అభ్యర్థులు నమ్మవద్దని సూచించారు.
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజా సమస్యల పరిష్కార వేదికపై ప్రజలు తమ స్పందన తెలియజేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. పి.జి.ఆర్.ఎస్ కేంద్రాలను సందర్శించే పౌరుల నుంచి అభిప్రాయాన్ని సేకరించేందుకు క్యూఆర్ కోడ్‌ను ప్రదర్శించాలని నిర్ణయించామని ఆదివారం ఓ ప్రకటన తెలిపారు. జిల్లా, మండల స్థాయి పి.జి.ఆర్.ఎస్ కేంద్రాలలో, వివిధ మాధ్యమాల్లో ప్రజల అభిప్రాయ సేకరణకు క్యూఆర్ కోడ్‌ను స్పష్టంగా, కంటికి కనిపించే పరిమాణంలో ముద్రించి, ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండే ప్రాంతాలలో ఏర్పాటు చేయాలన్నారు. పౌరులు పి.జి.ఆర్.ఎస్ సేవలను పొందిన వెంటనే తమ మొబైల్ ఫోన్‌ల ద్వారా క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేసి తమ అభిప్రాయాన్ని సమర్పించవచ్చన్నారు
మచిలీపట్నంఅర్బన్: జిల్లాలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించేందుకు సోమవారం (జూలై 20) ఫ్లయింగ్ స్టార్ట్ అవార్డ్స్–2026 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఉదయం 10.00 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఎంపికై న విద్యార్థులకు ప్రశంసాపత్రంతో పాటు ఒక్కొక్కరికీ రూ.20వేల నగదు బహుమతి అందజేయనున్నట్లు పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలోని 26 మండలాల నుంచి 168 మంది పదో తరగతి, 49 మంది ఇంటర్మీడియెట్ విద్యార్థులు పురస్కారాలకు ఎంపికయ్యారన్నారు. అవార్డులకు ఎంపికైన విద్యార్థులు సోమవారం ఉదయం 8.00 గంటలకే జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాల్‌కు చేరుకోవాలని, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ హాజరై అవార్డులు ప్రదానం చేయనున్నట్లు డీఈఓ వెల్లడించారు.
దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానంలో ఆదివారం ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి నిమ్మకాయల దండలతో అలంకరించారు. భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులు వేలాది సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు స్వీకరించి, మొక్కులు తీర్చుకున్నారు.


